Ysrcp Complaint To EC : జనసేనకు కామన్ సింబల్ ఇవ్వొద్దు, లోకేశ్ పై చర్యలు తీసుకోండి-ఈసీకి వైసీపీ ఫిర్యాదు-vijayawada news in telugu ysrcp complaint on tdp janasena to ec team demands action on lokesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Complaint To Ec : జనసేనకు కామన్ సింబల్ ఇవ్వొద్దు, లోకేశ్ పై చర్యలు తీసుకోండి-ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Ysrcp Complaint To EC : జనసేనకు కామన్ సింబల్ ఇవ్వొద్దు, లోకేశ్ పై చర్యలు తీసుకోండి-ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Bandaru Satyaprasad HT Telugu
Jan 09, 2024 05:14 PM IST

Ysrcp Complaint To EC : టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీకి ఈసీ బృందానికి ఫిర్యాదు చేసింది. గుర్తింపులేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది. లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని, ఆయన చర్యలు తీసుకోవాలని కోరింది.

వైసీపీ
వైసీపీ

Ysrcp Complaint To EC : ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. విజయవాడలో ఈసీ బృందం పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసీ బృందాన్ని కలిశారు. ఎన్నికల విధులకు సచివాలయ ఉద్యోగులను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కోరారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా ఈసీ బృందాన్ని కలిసి టీడీపీ, జనసేన పార్టీలపై ఫిర్యాదు చేశారు. గుర్తింపులేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి గుర్తింపు లేదని, అలాంటి పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో కామన్ సింబల్ ఎలా కేటాయిస్తారని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు

సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు సమావేశానికి ఆహ్వానించారని అడిగామన్నారు. గ్లాస్ సింబల్ సాధారణ గుర్తు అని, సాధారణ గుర్తు కలిగిన జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధమన్నారు. నారా లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో అధికారులపై చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఏపీ, తెలంగాణలో ఒకేసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలన్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు

టీడీపీ, జనసేన ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి పది లక్షల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని సీఈవోకి ఫిర్యాదు చేశారని,‌ ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓలు చెప్పాలి కానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారన్నారు. అసలు ఆ ఫిర్యాదు బోగస్ అన్నారు. తెలంగాణలో ఓట్లు కలిగిన వాళ్లకు ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని, ఇలాంటి డ్లూప్లికేట్ ఓట్లు తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీంతో దొంగ ఓటర్లను నియంత్రించవచ్చన్నారు. తెలంగాణ ఓటర్ లిస్టులో పేరు డిలీట్ చేశాకే ఏపీలో ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈసీని కోరామన్నారు. చంద్రబాబు, లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగుల్ని తప్పించండి- చంద్రబాబు, పవన్

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై విజయవాడ వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగుల్ని తప్పించాలని కోరారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని కోరారు. ప్రజల్లో ఉన్న తిరుగుబాటు చూసి ప్రతి చోట దొంగ ఓట్లను చేర్పించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని చంద్ర బాబు అరోపించారు. చంద్రగిరిలో 1.10లక్షల ఓట్ల కోసం ఫాం-6లను ఇస్తే, ఇప్పటికే 33వేల ఓట్లను అమోదించారని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌గా పనిచేసిన అధికారి గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కేంద్ర హోంమంత్రిని భద్రతా కోసం అభ్యర్థించాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని గుర్తు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమర్థులైన అధికారుల్ని వినియోగించాలని, ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు జాబితాను ఈసీకి అందచేసినట్టు తెలిపారు.

Whats_app_banner