Vangaveeti Radha : టీడీపీలోనే కొనసాగుతున్నా, పార్టీ మార్పుపై వంగవీటి రాధాకృష్ణ క్లారిటీ
Vangaveeti Radha : వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, తాను పార్టీ మారడంలేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు.
Vangaveeti Radha : టీడీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వంగవీటి రాధాకృష్ణ ఖండించారు. తాను పార్టీ మారడంలేదని, టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. వైసీపీ నేతల్నే టీడీపీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు రాధాకృష్ణ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మళ్లీ ఎన్నికల సమీపిస్తుండడంతో ఆయన పార్టీ మారుతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది.
గత ఎన్నికల ముందు
వంగవీటి రాధాకృష్ణను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. గత ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీలో సీఎం జగన్ తనను అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన రాధాకృష్ణ... ఎన్నికల్లో పోటీ చేయలేదు. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంగవీటి రాధాకృష్ణకు మంచి మిత్రులు. ఇటీవల రాధాకృష్ణ కాశీ వెళ్లినప్పుడు కొడాలి నానితో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వంగవీటి రాధా వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.
టీడీపీలోకి భవకుమార్!
విజయవాడలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు భవకుమార్ తో టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్ రావు, వంగవీటి రాధా, కేశినేని చిన్ని భేటీ అయ్యారు. నాారా లోకేశ్ తో భవకుమార్ భేటీ అయ్యారు. వైసీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని భవకుమార్ అన్నారు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. భవకుమార్ పార్టీని వీడికుండా దేవినేని అవినాశ్, వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.