Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్టు దారుణం, నా బాధ చెప్పుకోడానికి దుర్గమ్మ దగ్గరకు వచ్చా - నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari : ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై స్పందించారు.
Nara Bhuvaneshwari : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. తన బాధలు చెప్పుకోవడానికే దుర్గమ్మ దగ్గరకు వచ్చానన్నారు. ఏపీ ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని భువనేశ్వరి అన్నారు. తమ పోరాటానికి అందరూ మద్దతివ్వాలన్నారు. తన భర్తను రక్షించాలని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని ఇంద్రకీలాద్రి దుర్గమ్మను కోరుకున్నానన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగు కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఒక బిడ్డకు మనసు బాగాలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తారని, అలాగే నా బాధను చెప్పుకోవడానికే దుర్గమ్మ దగ్గరకు వచ్చానన్నారు. ఏపీ ప్రజల స్వేచ్ఛ కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు.
రేపు చంద్రబాబు వివాహవార్షికోత్సవం
రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని భావించారు. కానీ శనివారం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇవాళే అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
నారా భువనేశ్వరితో పాటు విజయవాడ దుర్గమ్మను నందమూరి రామకృష్ణ కూడా దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ...మా కుటుంబానికి అందరి ఆశీస్సులు కావాలన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం నిత్యం శ్రమించి వ్యక్తి చంద్రబాబు అన్నారు. సీఎం ఏపీని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రామకృష్ణ అన్నారు.
విజయవాడకు చేరుకున్న లోకేశ్
చంద్రబాబును తరలిస్తున్న వాహనాలు చిలకలూరి పేట నుంచి ముందుకు కదిలాయి. చంద్రబాబు స్వయంగా వచ్చి పార్టీ కార్యకర్తలను అడ్డుతప్పుకోవాలని కోరడంతో కార్యకర్తలు దారి ఇచ్చారు. అంతకు ముందు చిలకలూరిపేటలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యక్తలు చంద్రబాబును తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులపై లాఠీ ఛార్జ్ చేశారు. చంద్రబాబును కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కుంచనపల్లి సిట్ కార్యాలయం మార్గంలో పోలీసులు వాహనరాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న లోకేశ్ న్యాయవాదులతో సమాలోచనలు చేస్తు్న్నారు. చంద్రబాబును విజయవాడకు తరలించిన అనంతరం లోకేశ్ ఆయనను కలిసే అవకాశం ఉంది.