ACB Court : లింగమనేని ఇల్లు జప్తు కేసు, ఈ దశలో నిర్ణయం తీసుకోలేమన్న ఏసీబీ కోర్టు-vijayawada lingamaneni house attachment case acb court enquired cid petition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Acb Court : లింగమనేని ఇల్లు జప్తు కేసు, ఈ దశలో నిర్ణయం తీసుకోలేమన్న ఏసీబీ కోర్టు

ACB Court : లింగమనేని ఇల్లు జప్తు కేసు, ఈ దశలో నిర్ణయం తీసుకోలేమన్న ఏసీబీ కోర్టు

Bandaru Satyaprasad HT Telugu
Jun 06, 2023 07:25 PM IST

ACB Court : ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్‌ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారించింది. ఇంటిని జప్తు చేసేందుకు ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది.

లింగమనేని ఇల్లు జప్తు కేసు
లింగమనేని ఇల్లు జప్తు కేసు (HT )

ACB Court : ఉండవల్లి వద్ద కృష్ణ నది కరకట్ట సమీపంలో ఉన్న లింగమనేని రమేష్ ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లింగమనేని ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. ఇంటి జప్తునకు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాల విషయాన్ని అభ్యర్థించిన అధికారిని విచారించాల్సి ఉందంని ఏసీబీ కోర్టు తెలిపింది. మే 18న నోటీస్ ఆర్డర్ చేసినందున లింగమనేనికి నోటీసులు ఇవ్వాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అటాచ్‌ మెంట్‌ వ్యవహారంలో విచారణ జరిపే అధికారం ఏసీబీ కోర్టుకు ఉందన్నారు.

చంద్రబాబు ఉంటున్న ఇల్లు

భూ సమీకరణలో అక్రమాల నేపథ్యంలో ఉండవల్లిలో చంద్రబాబు ఉంటున్న ఇంటిని(లింగమనేని ఇల్లు) అటాచ్‌ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇంటిని జప్తు చేయడానికి సీఐడీ ప్రయత్నిస్తోంది. ఇంటిని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సీఐడీ. చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుతున్నాయి. కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరింది.

రెండు పిటిషన్లు

ఏపీ సీఐడీ తరపున రెండు పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ తరపు లాయర్ వివేకానంద తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్‌ మరొకటని కోర్టుకు వివరించారు. 1944 ఆర్డినెన్స్‌ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. క్రిమినల్‌ లా సవరణ ఆర్డినెన్స్‌-1944 నిబంధన ప్రకారం అటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది సోము కృష్ణమూర్తి కోరారు. కోర్టులో దాఖలుచేసిన దస్త్రాలను ప్రతివాదులకు ఇవ్వాలని సీఐడీని ఆదేశిస్తూ మే 17న న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇప్పటివరకూ దస్త్రాలను తమకు అందజేయలేదని గత విచారణలో వాదనలు వినిపించారు.

Whats_app_banner