Lokesh Bail Extended : నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ పొడిగింపు-vijayawada high court extended nara lokesh bail in skill case up to october 12th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Bail Extended : నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ పొడిగింపు

Lokesh Bail Extended : నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ పొడిగింపు

Bandaru Satyaprasad HT Telugu
Oct 04, 2023 04:44 PM IST

Lokesh Bail Extended : స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ ను అక్టోబర్ 12 వరకు పొడిగించింది హైకోర్టు.

నారా లోకేశ్
నారా లోకేశ్

Lokesh Bail Extended : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు మరోసారి ఊరట లభించింది. లోకేశ్ ముందస్తు బెయిల్‌‌ను అక్టోబర్ 12కు వరకు హైకోర్టు పొడిగించింది. లోకేశ్ ముందస్తు బెయిల్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్ ముందస్తు బెయిల్ నేటితో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. అయితే లోకేశ్ విచారణపై తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో అప్పటి వరకూ లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

yearly horoscope entry point

చంద్రబాబు బెయిల్, కస్టడీపై విచారణ

స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌ కుమార్ దూబే తన వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్‌ వెళ్లి అధ్యయనం చేశారని కోర్టుకు తెలియజేశారు. ఆమె అధ్యయనంతో సీమెన్స్‌ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. కాస్ట్ ఎవాల్యుయేషన్‌ కమిటీ స్కిల్‌ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్‌ ధరను నిర్ధారించిందన్నారు. ఈ కమిటీలో చంద్రబాబు లేరని కోర్టుకు తెలిపారు. కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని కోర్టుకు తెలియజేశారు.

కేబినెట్ ఆమోదంతోనే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు

టీడీపీ అధినేత చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రిమాండ్ లో ఉన్న చంద్రబాబును రెండ్రోజుల పాటు సీఐడీ విచారించిందన్నారు. మళ్లీ కస్టడీ కావాలంటూ పిటిషన్ వేశారని, ఆ అవసరం ఏముందని కోర్టును తెలిపారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టును అమలు చేశారని దూబే వాదించారు. కేబినెట్‌ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని వాదనలు వినిపించారు.

సీఐడీ తరఫున వాదనలు

సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్ కు పాల్పడ్డారని వాదనలు వినిపించారు. కేబినెట్ ఆమోదంతో ఒప్పందం జరిగిందనడంలో వాస్తవంలేదన్నారు. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారని, ఆయన పాస్ పోర్టు సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలన్నారు. స్కిల్ స్కామ్ కీలక దశలో ఉందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు.

Whats_app_banner