Vijayawada Fake Medicines : బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు, విజయవాడలో మెడికల్ మాఫియా గుట్టురట్టు!
Vijayawada Fake Medicines : విజయవాడలో భారీగా నకిలీ మందులు పట్టుబడ్డాయి. హోల్ సేల్ వ్యాపారుల వద్ద నకిలీ మందులను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు.
Vijayawada Fake Medicines : నకిలీ జాడ్యం మందులకూ పాకింది. బ్రాండెడ్ కంపెనీల పేరుల్లో మార్పులు అదే తరహాలో మందులు తయారు చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా విజయవాడలో భారీగా నకిలీ మందులు పట్టుబడ్డాయి. విజయవాడ వన్ టౌన్, గొల్లపూడిలోని హోల్‌సేల్ మందుల షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. బ్రాండెడ్ మందుల పేరుతో నకిలీ మందులను విక్రయిస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. హోల్‌సేల్ వ్యాపారులు అక్రమ మార్గంలో హైదరాబాద్ నుంచి నకిలీ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మందుల శాంపిల్స్ ను పరీక్షల కోసం డ్రగ్ కంట్రోల్ అధికారులు ల్యాబ్ కు పంపించారు. నకిలీ మందుల్లో గుండె సంబంధిత వ్యాధులకు వినియోగించే ఔషధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇటీవల తెలంగాణలో భారీగా నకిలీ మందులు వెలుగుచూశాయి. అక్కడి నిందితుల సమాచారంతో అధికారులు నెల్లూరు, కర్నూలు, గుంటూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. నకిలీ మందులు కలిగి ఉన్న ఇద్దరిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
డ్రగ్ బ్రాండ్లపై క్యూఆర్ కోడ్
నకిలీ మందుల నివారణ డీజీసీఐ ఇటీవల నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అల్లెగ్రా, డోలో, షెల్కాల్, కాల్‌పోల్, మెఫ్టాల్ స్పాస్‌తో సహా 300 డ్రగ్ బ్రాండ్లపై క్యూఆర్ కోడ్‌లను ముద్రించాలని ఆదేశించింది. ఈ కొత్త విధానాన్ని ఫార్మా కంపెనీలు కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో జరిమానా విధించనున్నట్లు డీజీసీఐ హెచ్చరించింది. కంపెనీ పేరు, బ్రాండ్, అడ్రస్, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు లైసెన్స్ నంబర్ వివరాలను మందుల షీట్లపై ముద్రించాలని ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఆయా కంపెనీలు క్యూఆర్ కోడ్, బార్‌కోడ్ ముద్రించడం తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్కెట్‌లో నకిలీ మందులు, నాణ్యత లేని నాసిరకం మందులు వస్తున్న క్రమంలో వీటిని నివారించేందుకు డీజీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
నకిలీల బెడద
దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అబాట్, గ్లెన్ మార్క్ కంపెనీల మందులను పోలిన నకిలీ మందులు అధికారులు గుర్తించారు. థైరాయిడ్ మందులు థైరోనోర్మ్, బీపీ మాత్రలు టెల్మా-హెచ్ సైతం నకిలీ మందులుగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తేల్చారు. ఇక దగ్గు సిరప్‌లు, ఇంజెక్షన్లు, టీకాల్లో కూడా మెడికల్ మాఫియా నకిలీవి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారులు ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.