Balakrishna : మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు, ఏపీ పాలిటిక్స్ పై బాలయ్య పవర్ ఫుల్ పంచ్ లు
Balakrishna : ఆహో ఓటీటీలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తాజా ఎపిసోడ్ ప్రసారం అవుతోంది. ఈ షోలో బాలయ్య రాజకీయ ప్రత్యర్థులపై పరోక్షంగా సెటైర్లు వేశారు.
Balakrishna : హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లిమిటెడ్ సీజన్ ప్రసారం అవుతోంది. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో బాలకృష్ణ తన సినిమానే ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో తన తాజా చిత్రం భగవంత్ కేసరి టీమ్ తో ముచ్చటించారు బాలయ్య. అయితే ఈ షో ప్రోమోలో బాలయ్య పంచ్ డైలాగులు ఏపీ రాజకీయాలనుద్దేశించేలా ఉన్నాయి. దీంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగాయి. షో లో బాలయ్య ఏపీ రాజకీయాలపై ఏమైనా మాట్లాడారా? అనే హైప్ క్రియేట్ అయింది.
పరోక్షంగా చురకలు
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్ కోసం చంద్రబాబు కోర్టుల బాటపట్టారు. చంద్రబాబుకు ఎప్పుడు వస్తుందో అని టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఈ తరుణంలో అన్ స్టాపబుల్ షోలో ఏపీ రాజకీయ పరిణామాలపై బాలకృష్ణ ఏం మట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఎపిసోడ్ కాబట్టి బాలకృష్ణ నేరుగా రాజకీయ విమర్శలు చేయకపోయినా పరోక్షంగా ప్రత్యర్థులకు చురకలు అంటించారు.
ఎవడు ఆపుతాడో చూద్దాం
'మా మాట సుపరిచితం, మా బాట సుపరిచితం... మేము ఏంటో మా వాళ్లేంటో, మా వెంట ఉండే మీకు సదా నమ్మకం' అంటూ బాలయ్య షో ప్రారంభించారు. రోజులు మారినా రుతువులు రంగులు మార్చినా, ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు అన్నారు. గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం, చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం, మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుందని బాలయ్య అన్నారు. ఈ షోలో బాలయ్య తన పంచ్ డైలాగులతో రాజకీయ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు. 'మేము తప్పు చేయలేదని మీకు తెలుసు. మేము తలవంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు... మేము మీకు తెలుసు. మా స్థానం మీ మనసు. అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం... ఎవడు ఆపుతాడో చూద్దాం' అని బాలకృష్ణ అన్నారు.
ప్రోమోలోనూ
అన్ స్టాపబుల్ షో ప్రోమోలో బాలయ్య పంచ్ డైలాగ్ షోపై మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. "మేం తలవంచమని మీకు తెలుసు, మనల్ని ఆపడానికి ఎవరూ రాలేడనీ తెలుసు" అంటూ బాలయ్య పంచ్ డైలాగ్ లు వైరల్ అవుతున్నాయి. సినిమా అయినా లైఫ్ లో అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు... మొత్తం నాశనం చేయటానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయటానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలంటూ బాలయ్య పంచ్ డైలాగులు వేశారు.