Bangladesh : బంగ్లాదేశ్‌లో పరిస్థితి చూసి.. భయంతో కాలినడకన భారత్‌లోకి ప్రవేశించిన 17 ఏళ్ల హిందూ బాలిక
Bangladesh Issue : బంగ్లాదేశ్‌లో హిందూవుల పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. దీంతో అక్కడ మైనార్టీలు అయిన హిందూవులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఇస్కాన్ సభ్యులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ 17 ఏళ్ల బాలిక కాలినడకన భారత్‌లోకి ప్రవేశించింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస ఆగేలా కనిపించడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన 17 ఏళ్ల హిందూ బాలిక పారిపోయి భారత సరిహద్దులోకి ప్రవేశించింది. ఆమెను సరిహద్దు భద్రతా దళాల అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. ఆమె ఇస్కాన్ భక్తురాలు అని కూడా తెలిసింది. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గత కొన్ని వారాలుగా తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని బాలికి చెప్పింది. ఆమెను కిడ్నాప్ చేసి మిగిలిన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్టుగా బాలిక వివరించింది. దీంతో దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకుంది.
చట్టబద్ధంగా భారత్ కు రావడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చిందని, అందుకే కాలినడకన సరిహద్దు వైపు పారిపోవాలని నిర్ణయించుకున్నానని బాలిక తెలిపింది. ఆమెను సరిహద్దు భద్రతా దళం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించింది. ఇక్కడే ఆమె తన కథను చెప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలో బాలిక అక్రమంగా సరిహద్దు దాటింది. తన బంధువుల్లో కొందరు భారత్ లో నివసిస్తున్నారని, వారి ఇళ్లకు తాను వెళ్తున్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణలో ఉంది. సరిహద్దు దాటడంలో తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా లేక ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
బాలికకు జల్పాయిగురి జిల్లాలో కొందరు బంధువులు ఉన్నారు. వారిని సంప్రదించినట్టుగా భద్రతా దళం పేర్కొంది. సరిహద్దు దాటేందుకు ఎవరు సహకరించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాకు చెందిన ఈ బాలిక కాలినడకన సరిహద్దు దాటుతూ నార్త్ దినాజ్ పూర్‌లోని చోప్రా బ్లాక్‌లోని ఫతేపూర్ బోర్డర్ పోస్ట్ వద్ద బీఎస్‌ఎఫ్‌కి కనిపించింది.
బాలిక బంధువు ఒకరు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు. 'ఆమె, ఆమె కుటుంబం ఇస్కాన్ భక్తులు. ఆమెను కిడ్నాప్ చేసి మిగిలిన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. భద్రత దృష్ట్యా ఇక్కడికి రావాలని అనుకుంది. కానీ ఏ తేదీలో వస్తుందో మాకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. బాలిక తండ్రి బంగ్లాదేశ్ లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.' అని బంధువు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో మతపరమైన హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. నవంబర్ 25న ఢాకాలో ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు తర్వాత ఇస్కాన్ భక్తులే తాజా టార్గెట్ అయినట్టుగా తెలుస్తోంది. మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మూకదాడులు, ఆస్తుల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్నాయి.
టాపిక్