TTD: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు-ttd board decides to appoint spiritual orator chaganti koteswara rao as its dharmic adviser ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

TTD: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 08:08 AM IST

spiritual orator Chaganti Koteswara Rao News: టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం
టీటీడీ బోర్డు కీలక నిర్ణయం (twitter)

Chaganti Koteswara Rao appoint as TTD dharmic adviser: తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ... టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వివిధ పారాయణాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందజేస్తామని పేర్కొన్నారు.మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించామని చెప్పారు.

సాధారణంగా భక్తుల రద్దీ..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 60,756 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 26,725 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

28న రథసప్తమి..

Ratha Sapthami: రథసప్తమి పర్వదినాన తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథ సప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

జనవరి 28వ తేదీన ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనంపై స్వామి వారు విహరిస్తారు.

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనంపై కనిపిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానంలో ఉంటారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనంపై విహరిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులకు కనిపిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఉంటారు.

రథసప్తమి కారణంగా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం