TTD Clarification On Room Charges : సామాన్యులపై అద్దె భారం లేదన్న టీటీడీ ఈవో…-ttd eo clarification on room charges hike in tirumala denies allegations of burden on public ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Clarification On Room Charges : సామాన్యులపై అద్దె భారం లేదన్న టీటీడీ ఈవో…

TTD Clarification On Room Charges : సామాన్యులపై అద్దె భారం లేదన్న టీటీడీ ఈవో…

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 07:41 PM IST

TTD Clarification On Room Charges తిరుమలలో టీటీడీ నిర్వహించే వసతి కేంద్రాల్లో సామాన్యులకు కేటాయించే గదుల్లో అద్దెల్ని పెంచలేదని టీటీడీ ఈవో ప్రకటించారు. ఇటీవల టీటీడీ రూ.120 కోట్ల రుపాయల వ్యయంతో అద్దె గదుల ఆధునీకీకరణ పనులు చేపట్టిందని, సామాన్యులకు కేటాయించే గదులపై ఎలాంటి భారం మోపలేదని స్పష్టం చేశారు. టీటీడీ అద్దె పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం వసతి ఛార్జీల పెంపు భారం లేదని ఈవో ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయం వసతి ఛార్జీల పెంపు భారం లేదని ఈవో ప్రకటన

TTD Clarification On Room Charges తిరుమలలో భక్తులకు కేటాయించే వసతి గదుల అద్దెల్ని భారీగా పెంచారనే విమర్శల్ని టీటీడీ తోసిపుచ్చింది. టీటీడీ సామాన్య భక్తులకు సౌకర్యాలను కల్పించడానికి పెద్ద పీట వేస్తోందని, సామాన్య భక్తులు పొందే గదుల అద్దె పెంచలేదని స్పష్టం చేశారు. టీవల రూ.120 కోట్లతో రూ.50/- రూ.100/- అద్దె గదుల ఆధునీకరణ పనులు చేపట్టామని, మరో రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. విఐపిలు బస చేసే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేశామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. టిటిడిపై దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని కోరారు.

తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులు బస చేసే రూ.50/-, రూ.100/- అద్దె గదులను రూ.120 కోట్లతో ఆధునీకరించామని, వీటి అద్దె ఏమాత్రం పెంచలేదని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు. విఐపిల కోసం కేటాయించే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేసేందుకే "నారాయణగిరి, ఎస్వీఆర్‌హెచ్‌, స్పెషల్‌ టైప్‌ విశ్రాంతి గృహాలను ఆధునీకరించి తగిన అద్దె నిర్ణయించామన్నారు.

సామాన్య భక్తులపై అధిక భారం మోపారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమలలో మొత్తం 7500 గదులు ఉన్నాయని, వీటిలో సామాన్య భక్తుల కోసం రూ.50/-, రూ.100/- అద్దెగల గదులు సుమారు 5 వేల వరకు ఉన్నాయని, ఇటీవల ఈ గదుల్లో గీజర్‌, ఫర్నీచర్‌, ఫ్లోరింగ్‌ తదితర ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. వీటిని భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, ఇందుకోసం విద్యుత్‌ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులకుగాను రోజుకు రూ.250/- వ్యయం అవుతోందని చెప్పారు. సామాన్య భక్తుల కోసం రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మిస్తున్నట్టు తెలిపారు.

విఐపిలకు కేటాయించే నారాయణగిరి-1, 2, 3, 4 విశ్రాంతి గృహాలు, ఎస్వీఆర్‌హెచ్‌, స్పెషల్‌ టైప్‌, వివిఆర్‌హెచ్‌ విశ్రాంతి గృహాల్లోని మొత్తం 170 గదులను గీజర్‌, ఎసి, ఉడెన్‌ కాట్‌, దివాన్‌ తదితర వసతులతో రూ.8 కోట్లతో ఆధునీకరించినట్టు ఈవో తెలిపారు.

తిరుమలలో భక్తులకు సౌకర్యాలు…

తిరుమలకు చేరుకున్న సామాన్య భక్తులకు ఐదు పిఎసిల్లో దాదాపు 7400 లాకర్లలో సుమారు 15 వేల మందికిపైగా భక్తులకు టిటిడి ఉచితంగా బస కల్పిస్తోందని ఈవో చెప్పారు. ఉచితంగా గదులు, హాళ్ళు, లాకర్లు, మరుగుదొడ్లు, స్నానపు గదుల వసతి కల్పిస్తున్నామన్నారు. ఈ కేంద్రాల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తున్నాము. వేడి నీటి సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

భక్తులకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నామని, రోజుకు లక్ష మంది ఉచితంగా భోంచేస్తున్నారని ఈవో చెప్పారు.

తాము బస చేసిన ప్రాంతాల నుంచి అన్నప్రసాద భవనానికి రాలేని వారికోసం వారికి సమీప ప్రాంతాల్లోనే ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు రెండు పూటలా ఉచితంగా అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

సామాన్య భక్తుల సదుపాయం కోసం ఇటీవలే పాత అన్నదానం భవనంలో కూడా అన్నదాన కార్యక్రమం ప్రారంభించామన్నారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన పేదలైనా, ధనికులైనా పైసా ఖర్చులేకుండా కడుపునిండా ఆహారం తీసుకునే సౌకర్యం నిరంతరాయంగా అమలు జరుగుతోందని, దీంతో పాటు భక్తులు వేచి ఉండే కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో కూడా నిరంతరాయంగా తాగునీరు, పాలు, టిఫిన్‌, అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోందని చెప్పారు.

రూ.50, రూ.100 కనీస అద్దెకే గీజర్‌, మంచం, పరుపు ఉండే గదులు వసతి కోసం కేటాయిస్తున్నట్లు ఈవో వివరించారు. ఉచితంగా లగేజి, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం సంవత్సరానికి రూ.30 కోట్ల వ్యయం అవుతోందన్నారు.

ఈ సదుపాయాలన్నీ తెలిసిన లక్షలాదిమంది సామాన్య భక్తులు తిరుమలలో వసతి, రవాణా, భోజనం, తలనీలాల సమర్పణ, దర్శనం, లడ్డూ ప్రసాదం అన్నీ ఉచితంగానే పొంది స్వామివారిని దర్శించుకుని వెళుతున్నారని చెప్పారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య, మధ్యతరగతి వర్గాలు తిరుపతిలో కాలు పెట్టినప్పటి నుంచి స్వామివారి దర్శనం అయ్యే వరకు అన్ని వసతులు టిటిడి ఉచితంగానే అందిస్తోందన్నారు. . తిరుపతి రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లో దిగిన సామాన్య భక్తులకు రైల్వే స్టేషన్‌ వెనకాల ఉన్న శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత వసతి, అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు ఈవో చెప్పారు.

ఆర్టీసి బస్టాండ్‌ ఎదురు ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం సముదాయంలోని హాళ్లలో ఉచితంగా ఉండే సదుపాయం ఉందని, ఇక్కడ కూడా అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోందని చెప్పారు. తిరుమలకు నడచి వెళ్ళే భక్తుల కోసం తిరుపతి రైల్వేస్టేషన్‌, ఆర్టీసి బస్టాండ్‌ నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల వరకు ఉచిత బస్సులు నడుపుతున్నామన్నారు.

10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : ఈవో

వైష్ణవాలయాల్లో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించవచ్చని దేశవ్యాప్తంగా ఉన్న 32 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు తెలియజేశారని, తద్వారా ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగలిగారని చెప్పారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి కమర్షియల్‌ చేశారని టిటిడి మాజీ ఛైర్మన్‌ ఆరోపించడం భావ్యం కాదన్నారు. అవసరమైతే మఠాధిపతులతోపాటు పండితుల కమిటీ సమర్పించిన నివేదికను కూడా వారికి పంపుతామని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్