Margadarsi Chits: ఏపీలో సోదాలు..తెలంగాణ హైకోర్టులో బ్రేకులు-ts high court relief to ramoji rao and silaja kiron in margadarsi chits case by ap cid ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ts High Court Relief To Ramoji Rao And Silaja Kiron In Margadarsi Chits Case By Ap Cid

Margadarsi Chits: ఏపీలో సోదాలు..తెలంగాణ హైకోర్టులో బ్రేకులు

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 06:16 AM IST

Margadarsi Chits: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌, సిఐడిలు దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది.మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజాకిరణ్, మార్గదర్శి చిట్స్‌పై కేసులు నమోదైన నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలొద్దని కోర్టు ఆదేశించింది.

మార్గదర్శి చిట్స్‌పై తెలంగాణ హైకోర్టు
మార్గదర్శి చిట్స్‌పై తెలంగాణ హైకోర్టు

Margadarsi Chits:ఏపీ సిఐడి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్‌ శాఖ దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఏపీ సిఐడి కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టులో సంస్థ ప్రతినిధులు సవాలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మార్గదర్శి కేసులు తేలే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూా ఆ సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

మార్గదర్శి వివాదానికి సంబంధించి ఇప్పటికే రెండు పిటిషన్‌లు తెలంగాణ హై కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో భిన్నమైన ఉత్తర్వులు రాకుండా నివారించడానికి అన్నింటినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. ఇతర పిటిషన్లతో కలిపి విచారించడానికి వీలుగా మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఫిర్యాదులు లేవు….

మార్గదర్శికి వ్యతిరేకంగా నాలుగు నెలల క్రితం పత్రికా ప్రకటనలు వెలువడినా ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదని, చిట్‌ఫండ్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉన్నందున ఛైర్మన్‌, ఎండీలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో నమోదైన కేసులను కొట్టి వేయాలని కోరుతూ మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్‌లపై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ కె.సురేందర్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

మార్గదర్శి నుంచి చిట్‌ మొత్తం గానీ, ఇతర సొమ్ము గానీ చెల్లించలేదంటూ ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. పత్రాలన్నీ తనిఖీ చేశాక ఖాతా వివరాలు, బ్యాంకు ఖాతాలు, సంవత్సరాంతం నిల్వ మొత్తాలు, డిపాజిటర్ల నుంచి సేకరించిన చందాలు పెట్టుబడులుగా పెట్టినట్లు ఆరోపించిన మొత్తాలకు సంబంధించిన వాటితో పాటు, చెల్లించిన మొత్తాలు, ముగింపు నిల్వలకు సంబంధించి 2014-15 నుంచి నవంబరు 2022 వరకు ఉన్న వివరాలను అధికారులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారన్నారు.

చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఈ చర్యలు చేపట్టామని, చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి పంపి, మ్యూచువల్‌ ఫండ్‌, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్నది ఏపీ ప్రభుత్వ ప్రధాన వాదన అని పేర్కొన్నారు. ఆరోపణలన్నీ పెట్టుబడులు పెట్టారంటూ చేసినవేనని, ఖాతాదారుల సొమ్మును ఖాతాల్లో చూపలేదని గానీ, కనిపించకుండా చేశారన్నది కాదన్నారు. ఏపీ అధికారులు ఆరోపించిన విధంగా ఒక వేళ చిట్‌ఫండ్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టిందనుకున్నప్పటికీ ప్రాథమికంగా అది నేరపూరిత దుర్వినియోగం లేదా చందాదారుని మోసగించడం కాదని తేల్చి చెప్పారు.

తెలంగాణ హైకోర్టుకు పరిధి ఉంది….

మార్గదర్శితో పాటు పిటిషనర్లు ఇదే కోర్టులో ఏపీ ప్రభుత్వ చర్యలపై ఇప్పటికే రెండు పిటిషన్‌లు దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్లు హైదరాబాద్‌లో నివాసం ఉండటంతో పాటు మార్గదర్శి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉందని, బ్రాంచిల ద్వారా చందాదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి పంపి పెట్టుబడులు పెడుతున్నారన్నది పిటిషనర్లపై ప్రధాన ఆరోపణ అని, అందువల్ల అధికరణ 226(2) ప్రకారం ఈ కోర్టుకు విచారణ పరిధి ఉందని ప్రకటించారు. నవీన్‌చంద్ర ఎన్‌.మజీతియాస్‌ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రకారం మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఉత్తర్వులు జారీ చేసే పరిధి ఈ కోర్టుకు ఉందని స్పష్టం చేశారు.

చిట్‌ఫండ్‌ కంపెనీపై నమోదైన ఫిర్యాదులన్నీ ఒకేలా ఉన్నాయని ఈ కోర్టు గమనించిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒక్క ఫిర్యాదు కూడా చందాదారు నుంచి రాలేదని, టి.టి.ఆంటోనీ వర్సెస్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట ఉల్లంఘనేనన్నారు. ఒకే నేరానికి సంబంధించి అందే ఫిర్యాదులపై ఎక్కువ కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. ఈ కేసులోనూ ఆరోపణలన్నీ ఒకటే అయినప్పటికీ ఏపీలోని చాలా పోలీసుస్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నందున దర్యాప్తును ఏపీలో కాకుండా బయట సంస్థలకు అప్పగించాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలో బలం ఉందన్నారు. ఇదే హైకోర్టులో మరో రెండు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున భిన్నమైన ఉత్తర్వులు వెలువడకుండా నివారించడానికి వాటితో కలిపి విచారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల వాటితో జత చేయడానికి వీలుగా ఈ పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అప్పటివరకు ఈ ఫిర్యాదులతో పాటు ఇలాంటి వాటిలో మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.

 

IPL_Entry_Point