Tirupati Police : బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్థారణ కాలేదు : తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు
Tirupati Police : తిరుపతి జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగిందనే ప్రచారం ఏపీలో సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో రాజకీయ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్థారణ కాలేదన్నారు.
తిరుపతి జిల్లాలో స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్న పదో తరగతి విద్యార్థినిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ప్రచారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు దాడి చేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీళ్లు తాగించారనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం ముళ్లు పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ స్పష్టత ఇచ్చారు.
'బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్థారణ కాలేదు. రాజకీయ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతాం. బాలికపై కేవలం దాడి మాత్రమే జరిగింది. దాడి చేసినవారు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఘటనపై విచారణ చేపట్టాం' అని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
అటు తిరుపతి ప్రభుత్వాస్పత్రి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. యలమందలో బాలికపై లైంగిక దాడి జరిగిందనే ప్రచారంతో.. బాలికను పరామర్శించేందుకు వైసీపీ నేతలు వచ్చారు. అయితే.. వారిని ఆస్పత్రిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలో రోజుకో అఘాయిత్యం జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేదని.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు.
అసలేం జరిగింది..
తిరుపతి జిల్లా యర్రవారిపాలెం మండలంలోని ఒక గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక జెడ్జీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి సమాచారం ప్రకారం.. ఎప్పటిలా సోమవారం కుమార్తె పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. పాఠశాలలో కుమార్తె లేకపోవడంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగుతున్న శబ్దం వినిపించింది. ముళ్ల పొదల్లోపలకి వెళ్లి చూశాడు. కుమార్తె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు.
పాఠశాల ముగిసిన తరువాత బాలిక నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్ బైక్‌పై మాస్క్‌లు ధరించి ఇద్దరు దుండగులు వచ్చారని, తనను అడ్డగించారని బాలిక తెలిపింది. వెంట తెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు బాలిక నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో బాలిక పొట్టపైన తన్నారు. ఆపై చాకుతో దాడి చేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ఇద్దరు దుండగుల్లో ఒకరు ఎవరికో వీడియో కాల్ చేసిన, ఈ అమ్మాయేనా? కాదా? అడిగి తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది. తరువాత సమీపంలో ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి బలవంతం చేశారని.. వివరించింది. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.