TG Ex Sarpanches Arrest : పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. అరెస్టు చేసిన పోలీసులు-police arrest former sarpanches demanding pending bills ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ex Sarpanches Arrest : పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. అరెస్టు చేసిన పోలీసులు

TG Ex Sarpanches Arrest : పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. అరెస్టు చేసిన పోలీసులు

Basani Shiva Kumar HT Telugu
Nov 04, 2024 10:19 AM IST

TG Ex Sarpanches Arrest : వారంతా మొన్నటి వరకు గ్రామాల ప్రథమ పౌరులు. పదవీకాలం ముగియడంతో మాజీలుగా మారారు. ఆ మాజీ సర్పంచులు.. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసి.. బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ సర్పంచుల అరెస్టు
మాజీ సర్పంచుల అరెస్టు

తెలంగాణలోని ప్రతి గ్రామంలో గత ఐదేళ్లలో సర్పంచులు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేశారు. కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి. మరికొంత గ్రామ సర్పంచులు కలిపి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. బిల్లులు మాత్రం రాలేదు. దీంతో చాలామంది సర్పంచులు అప్పులపాలయ్యారు. పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కారు.

ఇన్నాళ్లు పెండింగ్ బిల్లుల కోసం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ప్రకటన రాలేదు. దీంతో వారి ఆందోళనను రాజధానికి షిఫ్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చారు. పోరుబాట నేపథ్యంలో.. మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

ఏలాగోలా పోలీసుల నుంచి తప్పించుకొని కొందరు సర్పంచులు హైదరాబాద్ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పెండింగ్ బకాయిలు చెల్లించాలని విజ్ఞాపన పత్రం ఇవ్వాలనుకున్న మాజీ సర్పంచులను.. పోలీసులు అరెస్టు చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ సర్పంచుల అరెస్టుపై కేటీఆర్ స్పందించారు.

'రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.

'సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Whats_app_banner