Ganja Smuggling: ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి రవాణా, వాంకిడిలో 72లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన పోలీసులు-transportation of ganja in a tanker police seized ganja worth 72 lakhs in vankidi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Smuggling: ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి రవాణా, వాంకిడిలో 72లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన పోలీసులు

Ganja Smuggling: ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి రవాణా, వాంకిడిలో 72లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన పోలీసులు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 01, 2024 06:53 AM IST

Ganja Smuggling: గంజాయి రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు కొత్త దారులు వెదుక్కుంటూనే ఉన్నారు. తాజాగా పుష్ప సినిమా తరహాలో ఆయిల్ ట్యాంకర్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక అరల్లో లక్షల రుపాయల విలువైన గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.

ఆయిల్ ట్యాంకర్‌లో పట్టుబడిన గంజాయి
ఆయిల్ ట్యాంకర్‌లో పట్టుబడిన గంజాయి

Ganja Smuggling: ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఆంధ్రాఒడిశా బోర్డర్ల నుంచి నిత్యం పెద్దమొత్తంలొ గంజాయి వివిధ ప్రాంతాలకు తరలిపోతూనే ఉంది. మొత్తం సరఫరా అయ్యే దానిలో పట్టుబడే గంజాయి పదో వంతు కూడా ఉండదు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలిస్తున్న విధంగారు రియల్‌ లైఫ్‌లో కూడా ప్లాన్‌ చేశారు. పోలీపులకు ముందుస్తు సమాచారం లీక్ కావడంతో భారీగా గంజాయి పట్టుబడింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అచ్చం పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ తరహాలో జరిగింది. కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గురువారం సాయంత్రం పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలో రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌ అనుమానాస్పదంగా కనిపించండంతో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

ట్యాంకర్‌ మధ్య భాగంలో ప్రత్యేకంగా తాయారు చేసిన అరల్లో 290 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.72.50లక్షలు ఉంటుందని వివరించారు. డ్రైవర్‌ బల్వీర్‌ సింగ్‌ను అరెస్టు చేశామని, ప్రధాని నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి రకరకాల వాహనాల్లో వచ్చే గంజాయి ఖమ్మం జిల్లా మీదుగా దేశంలోని ఉత్తర భాగాలకు వెళ్లిపోతుంది. ఇందుకోసం రకరకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం అంబులెన్స్‌‌లో మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం సమీపంలో పట్టుబడింది.

అసలు సమస్య అక్కడే..

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి‎ ఊరికి గంజాయి వాడకం పాకింది. మద్యం ధరలు గణనీయంగా పెరగడంతో ప్రత్యామ్నాయ మత్తు పదార్ధాలకు యువత పెద్ద ఎత్తున అలవాటు పడ్డారు.

గుట్కా, ఖైనీల మాదిరి పాకెట్ల రూపంలో ప్రతి ఊళ్లలోకి గంజాయి వచ్చేసినా వాటిని అదుపు చేయడంలో వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఏపీలో గుట్కా, పాన్‌ మసాలా వినియోగంపై ఉన్న ఆంక్షల్ని తొలగించడంతో వాటి విక్రయాలు ఇప్పుడు యథేచ్ఛగా సాగుతున్నాయి. పైకి ప్యాకింగ్‌ పొగాకు తయారైన ఖైనీల మాదిరి ఉంటున్నా వాటి మాటున గంజాయిని కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో పండించే గంజాయికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. శీలావతి రకం గంజాయితో వచ్చే కిక్కుకు యువతను అలవాటు చేయడంలో దేశ వ్యాప్తంగా ముఠాలు విస్తరించాయి. గంజాయి సాగు కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కావడం లేదని పోలీసులు తరచూ చెబుతుంటారు. ఏపీలో ప్రతి ఊళ్లో గంజాయి వినియోగానికి అలవాటు పడిన గుంపులు నేరాలకు పాల్పడుతున్నాయి. ప్రతి నేరం వెనుక గంజాయి వినియోగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటోంది.

మరోవైపు నక్సల్ ఉద్యమాన్ని, మావోయిస్టులను ఏజెన్సీ ప్రాంతాల నుంచి పూర్తిగా తరిమికొట్టడంలో విజయం సాధించామని చెబుతున్న ఆంధ్రా పోలీసులకు గంజాయి సాగును మాత్రం ఎందుకు అదుపు చేయలేకపోతున్నారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించదు.

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించిన దట్టమైన అరణ్యంలో గంజాయి సాగు జోరుగా సాగుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో ఊరి పెద్దలే గంజాయి సాగుకు సారథ్యం వహిస్తుంటారు. గంజాయి విత్తనాలను నాటడం నుంచి వాటి మార్కెటింగ్ వరకు ఊరి పెద్దలే అన్నీ తామై చూసుకుంటారు. గంజాయి సాగు చేసే ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి కూడా వీల్లేనంద క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయి.

ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య ఈ భూభాగాలు విస్తరించి ఉండటంతో చాలా సందర్భాల్లో సరిహద్దు సమస్యలు తలెత్తుతుంటాయి. ఒడిశా నుంచి తగినంత సహకారం లేకపోవడం కూడా గంజాయి సాగును కట్టడి చేయలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గంజాయి రవాణా చేయడానికి విస్తృతమైన నెట్‌వర్క్‌లు ఏర్పటు అయ్యాయి. ఇందులో వాటిని కట్టడి చేయాల్సిన యంత్రాంగాలు కూడా భాగమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా అప్పుడప్పుడు ఒకటీ అరా కేసుల్లో గంజాయి స్వాధీనాలు జరుగుతున్న ఫలితం మాత్రం ఉండట్లేదు. రైళ్లు, బస్సులు, కార్లు, మోటర్ సైకిళ్లు ఇలా ఒకటేమిటి వీలున్న ప్రతి మార్గంలో సరఫరా జరుగుతూనే ఉంది.

గంజాయి సాగు చేసే వారికి దేశం నలుమూలల నుంచి నెట్‌వర్క్ ఉంటుందని, అవన్నీ వేర్వేరుగా పనిచేస్తుండట వల్ల వాటిని అడ్డుకోవడం సవాలుతో కూడిన వ్యవహారమని చెప్పారు. ఏజెన్సీ గ్రామాల్లో ఉండే ప్రజలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీలను గమనిస్తే ఈ సంగతి అర్థమైపోతుందని చెప్పారు. ఆ డబ్బు లావాదేవీలను అడ్డుకోవడం, నియంత్రించడం కష్టమని రిటైర్డ్‌ ఐజీ రంగారావు చెప్పారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి ఉపాధి ఉండదని వారికి గంజాయి సాగు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయిందని వివరించారు. ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేసినా గంజాయితో పోలిస్తే వచ్చే ఆదాయం తక్కువ కావడంతో అటువైపే మొగ్గు చూపుతున్నారని చెప్పారు.

పదో వంతు కూడా పట్టుబడదు...

తరచూ పోలీసులు, నార్కోటిక్ బృందాలకు పట్టుబడే గంజాయి.. మొత్తం సరఫరా అయ్యే దానిలో పదో వంతు కూడా ఉండదని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా వ్యవహారాలపై అవగాహన ఉన్న వారు చెబుతారు. ఒడిశా సరిహద్దుల నుంచి జాతీయ రహదారుల మీదుగానే గంజాయి రవాణా అవుతుందని గంజాయి సాగు, వ్యాపారం చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా సమాచారం లీకైతే తప్ప ఆ వాహనాలు ఎప్పుడూ సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లిపోతాయని చెబుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల నుంచి విద్యా, ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే వారిని రవాణాకు వాడుకుంటున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. సమీప పట్టణాలకు వచ్చే యువతకు డబ్బు ఎరవేసి గంజాయి తరలిస్తున్న ఉదంతాలు కూడా వెలుగు చూవాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, ఉపాధి సమస్యలతో ఇలాంటి పనులకు యువత ముందుకొస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Whats_app_banner