Jagtial Murder Case : కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడు అరెస్ట్ - వెలుగులోకి అసలు విషయాలు..!
జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. పాత పగతో కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్ కుమార్ ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు.
సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా 14 రిమాండ్ విధించారు. హత్య జరిగిన రోజున్నే నిందితుడు బత్తిని సంతోష్ గౌడ్ పోలీసులకు లొంగిపోయాడు. మూడు రోజులపాటు విచారించిన పోలీసులు...గంగారెడ్డి హత్యకు భూ వివాదం, పాత కక్షలే ప్రధాన కారణమని తేల్చారు. హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటించారు.
రాజకీయంగా దుమారం రేపిన జగిత్యాల జిల్లా జాబితాపూర్ మాజీ ఎంపిటీసి కాంగ్రెస్ కార్యకర్త ఎం గంగారెడ్డి హత్య నిందితుడు ఒక్కడే అని పోలీసులు తేల్చారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ గౌడ్ హత్య చేసినట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ను ఎస్పీ అశోక్ కుమార్ విడుదల చేశారు.
నిందితుడు సంతోష్ కు తన మామతో 15 ఏళ్ళుగా భూ వివాదం ఉంది. మామకు గంగారెడ్డి అండగా నిలిచాడు. గంగారెడ్డి చెప్పినట్లు మామ వినడంతో భూ వివాదం నేపథ్యంలో గంగారెడ్డి పై సంతోష్ కక్ష పెంచుకున్నాడు. సంతోష్ పై 2020లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై జ్యుడిషియల్ కస్టడీకి దారి తీసింది. ఆ కేసు వెనుక గంగారెడ్డి కీలక పాత్ర పోషించాడని అనుమానంతో సంతోష్ కక్ష పెంచుకున్నాడు. ఆ కేసు ట్రయల్ కు వచ్చింది..నవంబర్ 25న ఇయరింగ్ ఉంది.
కేసులో రాజీ కోసం సంతోష్ గంగారెడ్డిని కలువగా దూర్బాషలాడడంతో సంతోష్ మరింత కక్ష పెంచుకుని ఏలాగైనా గంగారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళికతో 22న గంగారెడ్డి బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారుతో సంతోష్ ఢీ కొట్టి కత్తితో పొడిచి చంపాడని ఎస్పీ తెలిపారు. కారు సెల్ పోన్ ఘటన స్థలంలోనే పడేసి పారిపోవడంతో సాంకేతిక పరమైన ఎవిడెన్స్ సేకరించి అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
ఇదివరకు 4 కేసులు…!
గంగారెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన సంతోష్ పై ఇదివరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో మూడు, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయింది. 2020లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా 2023 లో మూడు కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. గంగారెడ్డి హత్య రాజకీయంగా కలకలం సృష్టించడంతో ఇంకా ఆ కేసులో ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య కేసు నిందితుడు సంతోష్ కు పోలీసుల సహకారం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల రూరల్ ఎస్ ఐ తో సాహిత్యం ఉన్నట్లు స్పష్టమవుతుంది. సంతోష్ పోలీస్ స్టేషన్ లో రీల్ చేయడం అందుకు బలం చేకూరుతుంది.
హత్య జరిగిన అనంతరం సంతోష్ కాల్ డాటాను పరిశీలించిన కేసు దర్యాప్తు బృందానికి పోలీసులతో మాట్లాడిన ఆదారాలు లభించినట్లు సమాచారం. సంతోష్ తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో పోలీసులు ఆరా తీయగా ఓ ఎస్ ఐ తరచు మాట్లాడిన ఆధారాలు లబించడంతో ఎస్ఐపై చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు. నిందితుడు పోలీసుల సహకారంతోనే రెచ్చిపోయి ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తున నేపథ్యంలో పోలీసులపై సైతం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం