Vijay TVK : దళపతి విజయ్ టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ మ్యాజిక్ రిపీట్ చేయగలదా?
Vijay TVK : తమిళ సినీ నటుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ మ్యాజిక్ రిపీట్ చేయగలడా? లేదా చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ మొదలైన వారిలానే విజయ్ కూడా పార్టీకి శుభం కార్డు వేస్తారా? సాధారణంగానే ఈ ప్రశ్నలు అందరికీ వస్తున్నాయి.
తమిళగ వెట్రి కజగం(టీవీకే) తొలి సదస్సుతో దేశం మెుత్తం దళపతి విజయ్ వైపు చూసింది. అతడి మాటలను ఫైర్‌తో ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. ఈ సదస్సుకు జనం దాదాపు 5 లక్షల మంది వచ్చారని కొందరు పేర్కొన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో 5 నుంచి 8 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రధాన మీడియా దాదాపు 3 లక్షల మంది అని అంటోంది. అయితే వీటిలో ఏది నిజమైనప్పటికీ తమిళ నటుడు, రాజకీయవేత్త సి జోసెఫ్ విజయ్ అలియాస్ దళపతి వైపు అందరూ చూస్తున్నారు. తమిళ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తారా అని ఆసక్తిగా ఉన్నారు.
రెండు పార్టీలతో ఢీ
విజయ్ టీవీకే తమిళనాడులో డీఎంకే, ఏఐఏజీఎంకేలతో ఢీ కొట్టనుంది. అర్ధ శతాబ్దానికి పైగా రాజకీయం చేస్తున్న ఈ రెండు పార్టీల ఆధిపత్యానికి సవాలుగా అవుతుందని కొందరి వాదన. తమిళనాట పీఎంకే, ఎన్‌టీకే వంటి కొన్ని చిన్న పార్టీలు అప్పుడప్పుడు సందడి చేస్తున్నాయి. కాంగ్రెస్ వంటి జాతీయ రాజకీయ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు అండదండల మీద నడుస్తోంది. బీజేపీ తన స్థానం కోసం కష్టపడుతోంది.
నిజానికి జయలలిత లేకపోవడంతో ఏఐఏడీఎంకే పార్టీ పరిస్థితి ఘోరంగా తయరైందని చెప్పవచ్చు. టీవీకే ఎదగడానికి తమిళ రాజకీయంలో గ్రౌండ్ బాగుంది. కానీ విజయ్ దానిని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే ప్రశ్న అందరికీ ఉంది. పార్టీకి కావాల్సినంత గ్యాప్ ఉందని, అందుకే విజయ్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కానీ తమిళనాడు రాజకీయాలు అంత సులభమేమీ కాదు.
ద్రావిడ భావజాలం, జాతీయవాదం
ద్రవిడ రాజకీయాలలో అతిపెద్ద దిగ్గజాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలు చాలా ఏళ్లుగా శాసిస్తున్నాయి. రామసామి పెరియార్, అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలాంటి వారు కనుసన్నల్లో రాజకీయం నడిచింది. వీళ్లలో ఎవరినైనా కించపరిచి పైకి ఎదగేందుకు విజయ్ సాహసం చేయరు. విజయ్ కూడా ద్రావిడ భావజాలం నుండి దూరం కాకూడదని కోరుకున్నాడు. ద్రావిడిజం, జాతీయవాదం తన రాజకీయ భావజాలానికి రెండు కళ్ళు అని పేర్కొన్నాడు. పెరియార్, కె కామ్‌రాజ్, బీఆర్ అంబేద్కర్ వంటి నాయకుల నుండి తన పార్టీ సైద్ధాంతిక విలువలు ఉంటాయని చూపించాడు.
విజయ్ లక్ష్యాలు
తన దృష్టి సామాజిక న్యాయం, లౌకికవాదంపై ఉంటుందని నొక్కి చెప్పాడు విజయ్. మహిళా సాధికారత, వైద్యం, విద్య, స్వచ్ఛమైన తాగునీరు తదితర అంశాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని అన్నాడు. కుల గణన, దామాషా ప్రాతినిధ్యానికి తాను అండగా ఉంటానని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించాలని పేర్కొన్నాడు. తనతో చేరి అధికారాన్ని పంచుకోవాలనుకునే వారందరికీ తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని కూడా చెప్పారు.
అనుభవంతో ముందుకు
డీఎంకేలో క్రియాశీల సభ్యుడిగా ఉండి దశాబ్దాలుగా పార్టీ కోసం ప్రచారం చేసిన తరువాత ప్రముఖ సినీనటుడు ఎంజీఆర్ వేరే పార్టీ పెట్టారు. నిధుల సహాయం, ముఖ్యమైన పార్టీ సమావేశాలకు హాజరైన తర్వాత ఆయనకు అప్పటికే అనుభవం వచ్చింది. ఎంజీఆర్‌కు డీఎంకే కరుణానిధితో విభేదాలు వచ్చినప్పుడు తన అడుగులు వేసేందుకు కావాల్సినంత అవగాహన ఉంది. 1972లో ఏఐఎడీఎంకేను ప్రారంభించినప్పుడు, డీఎంకే(కరుణానిధి వ్యతిరేక వర్గం), తమిళనాడు రాజకీయాల (కాంగ్రెస్ నుండి) అనేక మంది ప్రముఖులు ఆయనతో చేరారు.
ఎంజీఆర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జూన్ 1977లో పార్టీ తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి డీఎంకేను గద్దె దించి.. ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు తగినంత సమయం కూడా ఆయనకు దొరికింది. ఇప్పుడు విజయ్‌కి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల మద్దతు లేదు. ఇప్పటి నుండి దాదాపు 18 నెలల్లో ఏప్రిల్ 2026లో తమిళనాడులో అధికారం కోసం దృష్టిని పెట్టాడు. అయితే ఎంజీఆర్ మ్యాజిక్ విజయ్ విషయంలో రిపీట్ అవుతుందా లేదా చూడాలి. ఎన్నికల వరకూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు విజయ్ దృష్టి పెట్టాలి.
తమిళనాడులో సినీ తారలను పూజించడం, కొన్ని సందర్భాల్లో వారిని దేవాలయాలను కూడా నిర్మించడం కూడా చూశాం. కాలం మారుతోంది. సినిమా పరిశ్రమలోని వారిని దేవుళ్లలా చూసే కాన్సెప్ట్ తగ్గుతోంది. ఈ సినిమా తారలు కేవలం మనుషులు మాత్రమేనని, దురాశకు, అధికారానికి లోనవుతారని కూడా ఇప్పుడు ఎక్కువ మందికి అర్థమైంది. ఒక సినిమా స్టార్ లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఏదైనా స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం పెద్ద విషయం కాదు. కానీ పార్టీని ప్రారంభించి.. దానిని ముందుకు తీసుకెళ్లాలి అంటే చాలా పెద్ద టాస్క్.
విజయ్ వెలుగుతారా?
విజయ్ ఈ రాజకీయ పరీక్షలో పాస్ అవుతారా? లేదా అనేది ఆయన పట్టుదల, సంకల్పం, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఆయన నటించడానికి స్క్రిప్ట్ ఉండదు. అనుభవంతో ముందుకు సాగుతూ.. పార్టీని బలోపేతం చేస్తూ వెళ్లాలి. మరో సినిమా స్టార్ రాజకీయాల్లో వెలుగుతారా లేదో భవిష్యత్తులో చూడాలి..