విజయవాడ నగరంలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. మాటల్లో చెప్పలేని.. రాతల్లో రాయలేని బాధలను మిగిల్చాయి. కనీసం తాగడానికి చుక్క నీరు కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. రోజుల తరబడి ప్రజలు సాయం కోసం ఎదురు చూశారు. అధికారులు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రాత్రిబంవళ్లు కష్టపడి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. విజయవాడ వరదల గురించి చంద్రబాబు ఆహా షోలో ప్రస్తావిస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు.
విజయవాడ వరదల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. వరదలు వస్తే హెలికాప్టర్‌లో తిరిగే నాయకులున్న ఈ రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారని ప్రశంసించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కించకూడదన్నారు. అందుకే బోటు ఎక్కి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లినట్టు వివరించారు. ఎన్టీఆర్ఎఫ్ అధికారులు వద్దని చెప్పినా వినలేదని.. తాను వెళ్లి అధికారులను పరుగులు పెట్టించానని చెప్పారు.
'నేను వెళ్లి చూస్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయి. అందుకే ముందుకు వెళ్లాను. అక్కడి తీవ్రత అర్థమయ్యాక కలెక్టరేట్‌కు చేరుకుని బస్సులోనే 10 రోజులు బసచేశాను. ఒక తండ్రి నా దగ్గరకు వచ్చి 3 రోజుల నుంచి పిల్లాడు నీళ్లు అడుగుతున్నాడు.. రెండు బాటిళ్ల నీళ్లు ఇప్పించాలని అడిగాడు. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎన్ని మార్గాలుంటే అన్నీ మార్గాలను ఉపయోగించి ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు అందజేశాం. ఏది దొరికితే అది పంపించాం' అని చంద్రబాబు వివరించారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు చంద్రబాబు కళ్లు చెమర్చాయి.
షో జరుగుతుండగా.. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రశ్నలు వేశాడు. వాటికి చంద్రబాబు నవ్వుతూ.. సమాధానం చెప్పారు. ఎప్పుడూ ముందే ఉంటుంది.. కానీ కనిపించదు. అదేంటి? అని దేవాన్ష్ ప్రశ్నించగా.. భవిష్యత్తు అని చంద్రబాబు సమాధానం చెప్పారు. మీరు ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటారు.. తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు? అని మరో ప్రశ్న వేశారు. 'నువ్వు టైం ఇస్తే నీతో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యేవాణ్ని. కానీ ఇప్పుడు నువ్వు టైం ఇవ్వట్లేదు కదా.. నువ్వు ఎప్పుడూ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంటావ్.. అది బోర్ కొడితే సైన్స్ చదువుతావ్.. నాక్కూడా పని మార్చుకుంటే రిలాక్సేషన్ వస్తుంది' అని చంద్రబాబు ఆన్సర్ చెప్పారు.