RedSandal : తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత..
తిరుపతిలో మరోమారు భారీగా ఎర్రచందనం పట్టుబడింది. కూలీలకు డబ్బులు ఎరవేసి బెంగుళూరు తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 75 లక్షల విలువ చేసే 43 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారు ,ఆటో, రెండు మోటర్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు.
ఎర్ర చందనం స్మగ్లర్లు రూటు మార్చారు. ఇన్నాళ్లు తమిళ నాడు నుంచి కూలీలను శేషాచలం అడవుల్లోకి పంపి ఎర్రచందనం చెట్లను నరికించేవారు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల నుంచి పేదలు, కూలీలను గుర్తించి వారికి డబ్బులు ఆశచూపి స్మగ్లింగ్‌లోకి దించుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తిరుపతి జిల్లా బాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లక్షల రుపాయల విలువైన ఎర్రచందనం పట్టుబడింది. చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీలోని దేవరకొండ గొల్లపల్లి గ్రామం సమీపంలో అమ్మవారి చెరువు పొదల్లో దాచిన ఎర్రచందనం దుంగలను సీజ్ చేయడంతోపాటు ఐదుగురు ముద్దాయిలను బుధవారం అరెస్టు చేశారు .
బెంగుళూరు హోస్కొట్ కు చెందిన అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు వసీం ఖాన్, నదీమ్ ఖాన్ లు దేవరకొండ పంచాయతీలోని నాగరాజుకు శేషాచల అడవి నుంచి ఎర్రచందనం దుంగలను నరికి, బెంగళూరుకి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు నాగరాజు తన బంధువులతో పాటు మరి కొంతమందితో కలిసి శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను బెంగళూరు తరలించడానికిి సిద్ధం చేసుకున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో దేవరకొండ గొల్లపల్లి గ్రామం సమీపంలోని అమ్మవారి చెరువు వద్ద రవాణాకు సిద్ధంగా ఉంచిన 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేయగా మరో ఏడుగురు స్మగ్లర్లు పారిపోయారని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో ఆటోడ్రైవర్ కత్తి అన్నమయ్య, పానీపూరీ వ్యాపారం చేసే మామిడికోన సురేష్, బ్ల్యూ డర్ట్ కంపెనీలో కొరియర్ బాయ్‌గా పనిచేసే దేరంగుల వాసు, కత్తి ఎర్రయ్య, కత్తి శ్రీరాములు ఉన్నారు. వీరితో పాటు కత్తి నాగరాజు, కత్తి తులసి, కత్తి.గౌరి శంకర్, మామిడికోట రెడ్డి ప్రసాద్, చిప్పిడి రమేశ్‌లు పరారయ్యారు. వీరితో పాటు ప్రధాన స్మగ్లర్లు వసీం ఖాన్ , నదీం ఖాన్‌లను అరెస్ట్ చేయాల్సి ఉంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టైన వారిపై రౌడీషీట్లు తెరుస్తామని తిరుపతి రేంజీ డిఐజి రవిప్రకాష్ తెలిపారు. పారిపోయిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లు వసీం ఖాన్, నదీమ్ ఖాన్‌లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెబుతున్నారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు చిన్నగొట్టిగల్లుకి వచ్చి నాగరాజుకు ఎర్ర చందనం దుంగలను కర్ణాటక తరలించడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరుకి వెళ్లిన తర్వాత వారి సూచన ప్రకారం , నాగరాజు అతని అనుచరులు ఎర్రచందనం దుంగలను బెంగళూరు సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దమొత్తంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టామని, నిందితులను అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేసినట్లు డిఐజి తెలిపారు.
ఇటీవల తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో కూడా బడా స్మగ్లర్ల అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎర్రచందనం చెట్లను కాపాడడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తిరుపతి పోలీసులు తెలిపారు. గతంలో ఎర్ర చందనం అక్రమ రవాణాలో తమిళ స్మగ్లర్ల కీలక పాత్ర పోషించే వారని, ప్రస్తుతం రాయలసీమలో గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు అక్రమ రవాణా దిగుతున్నారని దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో రాజీపడే ప్రసక్తే లేదని డిఐజి స్పష్టం చేశారు.
టాపిక్