Kadapa : మహిళా టీచర్ ఘరానా మోసం.. రైస్ పుల్లింగ్ పేరుతో రూ.1.37 కోట్ల స్వాహా
Kadapa : కడప జిల్లాలో ఘారానా మోసం బయటపడింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఈ మోసానికి పాల్పడింది. రైస్ పుల్లింగ్ పేరుతో ఏకంగా రూ.1.37 కోట్లను స్వాహా చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయిచడంతో నిందితురాలిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆ మహిళా టీచర్ పరారీలో ఉన్నారు.
కడప జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు రెండో పట్టణ సీఐ ఎం.యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో పొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శోభారాణి పని చేశారు. ప్రస్తుతం కడపలో పని చేస్తున్నారు. శోభారాణి తన దూరపు బంధువు అయిన బెంగళూరుకు చెందిన అపర్ణతో ఓ భారీ మోసానికి తెలిరేపింది. కడప జిల్లా దువ్వూరు మండలం గొల్లపల్లికి చెందిన మూల వెంకటరమణా రెడ్డి అనే వ్యక్తిని నమ్మించి మోసం చేశారు.
రైస్ పుల్లింగ్ వ్యాపారంతో మంచి లాభాలు గడించొచ్చని చెప్పి, పెట్టుబడి పెట్టించారు. రైస్ పుల్లింగ్‌కు సంబంధించిన పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని, అష్ట ఐశ్వర్యాలు, సకల సంతోషాలు పొందవచ్చని నమ్మబలికారు. చాలా మంది ధనవంతుల దగ్గర అలాంటి పాత్రలు ఉండడంతో వారు కోట్లు సంపాదిస్తున్నారని చెప్పారు. దీంతో వారిని వెంకట రమణా రెడ్డి నమ్మాడు. దశల వారీగా ఆయన వద్ద నుంచి దాదాపు రూ.1.37 కోట్లు తీసుకున్నారు.
అయితే.. అలాంటి వస్తువు వారి దగ్గర ఏమీ లేదని వెంకటరమణా రెడ్డి తెలుసుకునే లోపే వారు ఈ మోసానికి ఒడిగట్టారు. తాను ఇచ్చిన మొత్తం రూ.1.37 కోట్లు తిరిగి ఇవ్వాలని వెంకటరమణా రెడ్డి అడగగా, అతన్ని బెదిరించి మరికొంత మొత్తం వసూలు చేసుకున్నారు. ఎప్పుడైనా మళ్లీ డబ్బులు అడిగితే చంపుతామని ఇద్దరి మహిళలు మరికొంత మందితో కలిసి బెదిరించేవారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో నవంబర్ 26న ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. శుక్రవారం అపర్ణ (బెంగళూరు), అరుణకుమారి (కదిరి), రామాంజనేయులు (అనంతపురం) ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. శోభారాణితో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులును కోర్టులో ప్రవేశపెట్టారు. మిగిలిన వ్యక్తులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, కేసు విచారణ జరుపుతామని సీఐ ఎం.యుగంధర్ వెల్లడించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)