Nara Bhuvaneswari : చంద్రబాబు జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే, ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటాం- నారా భువనేశ్వరి-tirupati nara bhuvaneswari visits tdp activists families in nijam gelavali tour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Bhuvaneswari : చంద్రబాబు జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే, ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటాం- నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari : చంద్రబాబు జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే, ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటాం- నారా భువనేశ్వరి

Bandaru Satyaprasad HT Telugu
Oct 25, 2023 05:37 PM IST

Nara Bhuvaneswari : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

నారా భువనేశ్వరి
నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో జైల్లో ఉన్నా ఆయన మనసంతా ప్రజలపైనే ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. తిరుపతి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున భువనేశ్వరి చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. పరామర్శకు ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ సెప్టెంబర్ 25న మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి బుధవారం కలిసి పరామర్శించారు.

భరోసా ఇవ్వడం మా బాధ్యత

ఈ సందర్బంగా భువనేశ్వరి మాట్లాడుతూ...‘‘పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు వారిని కలిసి భరోసా ఇవ్వడం మా బాధ్యత. అరెస్టును జీర్ణించుకోలేక కార్యకర్తలు చనిపోయారన్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. ఆయన జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉంది. మా కుటుంబం కంటే కార్యకర్తలపైనే ఆయనకు ధ్యాస ఎక్కువ. ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ మృతి బాధాకరం. ప్రవీణ్ రెడ్డి చనిపోయిన రెండు రోజులకు బిడ్డ పుట్టాడని తెలిసింది. బిడ్డను చూసుకునే రాత ప్రవీణ్ రెడ్డికి లేదన్న విషయం చాలా బాధేసింది. కుమారుడిగా తల్లిదండ్రులకు ప్రవీణ్ రెడ్డి ఎలా అండగా ఉన్నారో..పార్టీ కూడా అంతే అండగా ఉంటుంది.’’ అని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి, కనుమూరి చిన్నబ్బ కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రగిరిలో నిర్వహించిన సభలో భువనేశ్వరి మాట్లాడుతూ.. నిజం గెలవాలి కార్యక్రమం ఒక పోరాటం అన్నారు. తన బాధను మహిళలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడికి రాలేదన్న ఆమె... నిజం గెలవాలి అని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. ఈ పోరాటం తనది మాత్రమే కాదని, ప్రజలందరిదీ అన్నారు.

Whats_app_banner