TTD Alert On Tirupati Rains : అతి భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ హైఅలర్ట్, అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tirupati heavy rains ttd high alert vip break darshan cancelled on october 16th key orders to officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Alert On Tirupati Rains : అతి భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ హైఅలర్ట్, అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Alert On Tirupati Rains : అతి భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ హైఅలర్ట్, అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Bandaru Satyaprasad HT Telugu
Oct 14, 2024 05:55 PM IST

TTD Alert On Tirupati Rains : రానున్న 48 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అక్టోబర్ 15న సిఫార్సు లేఖలు తీసుకోమని ప్రకటించింది.

అతి భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ హైఅలర్ట్, అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అతి భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ హైఅలర్ట్, అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణపై టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి ఈవో అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈవో శ్యామలరావు అధికారులతో మాట్లాడుతూ... 48 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. 2021లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని గుర్తుచేశారు. ఈ విపత్తు ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులను కోరారు. ఈవో స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈవో ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందన్నారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు.

కొండ చరియలపై నిఘా

కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు ఈవో సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్తు అంతరాయ పరిస్థితుల్లో జనరేటర్లు నడపడానికి ముందస్తుగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యశాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని, ఘాట్ రోడ్డులలో జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకుని సమాయత్తంగా ఉండాలని ఈవో సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితులను ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అక్టోబర్ 16న తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 15న ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించమని భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

సోమవారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఆలయ పరిసరాలు, మాఢవీధులు నీటితో నిండిపోయాయి.

Whats_app_banner

సంబంధిత కథనం