Schools Holiday: రాయలసీమలో భారీ వర్షాలు.. తిరుపతిలో పాఠశాలలకు సెలవులు-heavy rains in rayalaseema school holidays in tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Schools Holiday: రాయలసీమలో భారీ వర్షాలు.. తిరుపతిలో పాఠశాలలకు సెలవులు

Schools Holiday: రాయలసీమలో భారీ వర్షాలు.. తిరుపతిలో పాఠశాలలకు సెలవులు

Schools Holiday: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కావలి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరుపతిలో భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 14 నుంచి 17 వరకు ఏపీలో భారీ వర్షాలు

Schools Holiday: భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ 14 సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ప్రకటించారు.

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల కు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటించారు. ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రేపు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

ఆ తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

అల్పపీడనం నేపథ్యంలో బుధ,గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉంది.

నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.