Tirumala One crore Seva Ticket : తిరుమల శ్రీవారి కోటి రూపాయల సేవా టికెట్-ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారిసేవలో
Tirumala One crore Seva Ticket : తిరుమల శ్రీవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సేవల్లో పాల్గొంటూ దర్శించుకునే భాగ్యం కలిగిస్తుందో టీటీడీ. ఇందుకు గాను భక్తులు రూ.కోటి సేవాల టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్ తో భక్తులు ఉదయాస్తమానం శ్రీవారిని దర్శించుకోవచ్చు.
Tirumala One crore Seva Ticket : కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి క్షణకాల దర్శనం కోసం భక్తులు వేల కిలో మీటర్లు ప్రయాణించి, గంటల పాటు క్యూలైన్లలో వేచిచూస్తారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమలకు వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలని లక్షల మంది భక్తులు పరితపిస్తుంటారు. అలాంటి శ్రీనివాసుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి సేవలను వీక్షిస్తూ... ఏడు కొండల స్వామి నిజరూప దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తే అంతకన్నా ఏంకావాలి. దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం తిరుమల కొండకు వస్తుంటారు. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి దర్శన టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే శ్రీవారిని రోజంతా దర్శించుకునేందుకు ఓ ప్రత్యేకమైన టికెట్ ను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ ధర అక్షరాలా కోటి రూపాయలు.
ఉదయాస్తమాన సేవా టికెట్ బుక్ చేసుకుంటే 25 ఏళ్లు లేదా జీవితాంతం ప్రతి ఏడాది శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. శ్రీవారిని నిత్యం ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం సహస్రదీపాలంకార సేవ వరకూ ఎన్నో ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సేవలను వీక్షించాలని భక్తులు ఎంతగానే వేచిచూస్తారు. ఈ ఉదాయాస్తమానసేవ టికెట్‌ను తీసుకుంటే ఏడాదిలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాల సేవల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఉదయాస్తమాన సర్వసేవ పేరుతో 1980లో ఈ సేవా టికెట్‌ను టీటీడీ ప్రారంభించారు.
ఈ టికెట్ కు పోటీ పెరగడంతో కొన్నేళ్లపాటు ఆపేసింది. మళ్లీ 2021లో కోటి రూపాయల టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు రోజులకు రూ. కోటి కాగా, శుక్రవారం మాత్రం ఈ టికెట్ విలువ రూ. కోటిన్నర ఉంటుంది. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయని టీటీడీ ప్రకటించింది. శుక్రవారం సేవలకు సంబంధించిన అన్ని టికెట్లు బుక్ అయ్యాయని టీటీడీ పేర్కొంది. ఏడాదిలో మీకు నచ్చిన రోజును టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కంపెనీ పేరుతో టికెట్ తీసుకుంటే 20 ఏళ్లు పాటు వారికి దర్శనానికి వీలు ఉంది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలు, ప్రసాదాలు అందిస్తారు. కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు, మార్పునకు కూడా అవకాశం ఉంటుంది. కోటి రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
కోటి టికెట్ ప్రత్యేకతలు
ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ సేవా టికెట్ ను కొనుగోలు చేస్తే...సంవత్సరంలో ఏదైనా ఒక రోజును ఎంచుకుని ఉదయాస్తమానం శ్రీవారిని దర్శించుకోవచ్చు. రోజంతా శ్రీవారి సేవల్లో భాగం కావొచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలలో పాల్గొనవచ్చు. 25 ఏళ్లు పాటు లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగిన విధంగా ఈ టికెట్‌ను వినియోగించుకోవచ్చు. టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఏదైనా కారణం చేత అయినా ఆ ఏడాది తిరుమలకు రాలేకపోతే.. వారి కుటుంబసభ్యులను ఈ సేవకు పంపవచ్చు. కుటుంబ సభ్యుల పేర్ల మార్పునకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. కంపెనీలకు ఎన్నిసార్లైనా పేర్లు మార్పు చేసుకునే అవకాశం ఇస్తారు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లో లాగిన్ అయ్యి ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు కార్డు అప్‌లోడ్ చేయాలి. ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ కు టీటీడీ ఐడీ, పాస్‌వర్డ్ పంపుతారు. వీటితో ఉదయాస్తమాన సేవా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం