Tirumala : వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం- ప్రతి రోజు 3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్-tirumala srivari darshan ttd special slot for senior citizens differently abled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం- ప్రతి రోజు 3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్

Tirumala : వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం- ప్రతి రోజు 3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 07:21 PM IST

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 10-12 గంటలు పడుతుందని టీటీడీ ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగులు 30 నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం
వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు నుంచి వస్తున్న భక్తులతో 19 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శుక్రవారం ఒక్క రోజే స్వామివారిని 63,830 మంది యాత్రికులు దర్శించుకున్నారు. 30,810 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.20 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కి టీటీడీ ఉచిత దర్శనం

ఇప్పుడు ఉచితంగానే శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు రావొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఈ ఉచిత దర్శనం ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఆయా వర్గాలకు టీటీడీ శుభవార్త చెప్పింది.‌

వారికి రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్

టీటీడీ దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కు స్వామి వారి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ కూడా ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది. తిరుమల ఆలయం బయట గేట్ వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ పేర్కొంది.

ఆ సమయంలో ఇతర క్యూలు నిలిపివేత

వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తామని పేర్కొంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారి దర్శనం పూర్తి అవుతుంది. స్వామి వారి దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ. 20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. అయితే ఈ సదుపాయం పొందాలని భావించే వృద్ధులకు వయస్సు 65 ఏళ్లు పూర్తి కావాలి. దివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ పెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అలాగే ఒకవేళ వృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉంటే, వారి వెంట ఓ వ్యక్తికి అనుమతి ఉంటుంది. అటెండర్ గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు ఈ సేవలు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ సేవలకు ఐడీ ఫ్రూప్ గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు, ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు పట్టుకొని వెళ్లాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తమ సంబంధిత సర్జన్, స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.

టికెట్టు ఇలా బుక్ చేసుకోవాలి

వయో వృద్ధులు, దివ్య దర్శనం స్లాట్ కోసం టికెట్ ను ఆన్‌లైన్‌లో టీటీడీ వెబ్‌సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. టీటీడీ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోంపేజీలో ఆన్‌లైన్ సర్వీస్‌ ఆప్షన్ ఉంటుంది. ‌దానిపై క్లిక్ చేయాలి. దాని తరువాత సీనియర్ సిటిజన్ దర్శనం, డిఫరెంట్ లీ ఏబుల్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అక్కడ ఉన్న బాక్స్ లో మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని బాక్స్‌లో ఎంటర్ చేసి, దానితో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు కేటగిరీ ఆప్షన్ లో సీనియర్ సిటిజన్ అనే అప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత మీరు ఏ రోజు స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నారో , ఆ తేదీని ఎంచుకోవాలి. తరువాత మిగిలిన వివరాలు నమోదు చేసి టిక్కెట్టు బుక్ చేసుకోవాలి. వృద్దులు, దివ్యాంగులు ఇలా సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం