TTD Alert : భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం - ఆ తేదీ వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-ttd has issued a key announcement on vip break darshans in the wake of rush of devotees in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Alert : భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం - ఆ తేదీ వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Alert : భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం - ఆ తేదీ వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 24, 2024 01:58 PM IST

Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ (Photo Source SVBC TTD FB Page)

Tirumala Tirupati Devasthanams Updates : గత కొద్దిరోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

జూన్ 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు రద్దు….

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు(శుక్ర, శని, ఆదివారం తేదీలు)వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది.

శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 - 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే...బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది.

టైమ్‌ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది. గురువారం సాయంత్రం క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లు నిండిపోవడంతో నారాయణ గిరి షెడ్లు నిండిపోయి రింగురోడ్డులోని బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

గురువారం రాత్రికి భారీగా భక్తులు వేచి ఉండటంతో కొత్తగా భక్తుల్ని క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున ఆరింటి క్యూలైన్లలోకి రావాలని భక్తులకు టీటీడీ సూచించింది. క్యూలైన్లకు వచ్చే భక్తులు బస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు వారాంతంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది.

ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల….

మరోవైపు ఆగస్టు నెల కోటాకు సంబంధించి రూ.300 తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల టీటీడీ విడుదల చేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు www.ttdevasthanams.ap.gov.i వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

గురువారం తిరుమల శ్రీవారిని 65,416మంది దర్శించుకన్నారు. 36,128మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.3.51కోట్లు లభించాయి. సర్వదర్శనం టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.

వైభవంగా గోవిందుడి రథోత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.35 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదేనని పండితులు వివరించారు.

టీ20 వరల్డ్ కప్ 2024