AP Agency Floods: ఏజెన్సీలో బీభ‌త్సం, ఉగ్ర‌రూపం దాల్చిన వాగులు...వంద‌లాది గ్రామాల‌కు రాక‌పోక‌లు బంద్‌...-there is chaos in the agency raging rivers traffic is blocked in hundreds of villages ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Agency Floods: ఏజెన్సీలో బీభ‌త్సం, ఉగ్ర‌రూపం దాల్చిన వాగులు...వంద‌లాది గ్రామాల‌కు రాక‌పోక‌లు బంద్‌...

AP Agency Floods: ఏజెన్సీలో బీభ‌త్సం, ఉగ్ర‌రూపం దాల్చిన వాగులు...వంద‌లాది గ్రామాల‌కు రాక‌పోక‌లు బంద్‌...

HT Telugu Desk HT Telugu
Sep 10, 2024 09:29 AM IST

AP Agency Floods: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వ‌ర్షం బీభ‌త్సం సృష్టించింది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా భారీ వ‌ర్షం కురింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంక‌లు ఉగ్ర‌రూపం దాల్చాయి. ప‌లు చోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. వంద‌లాది గిరిజ‌న గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం
భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం

AP Agency Floods: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌తో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం అయింది. చింతపల్లి ఏజెన్సీలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అల్లూరి సీతరామ‌రాజు జిల్లా గూడెం కొత్తవీధి (జీకే వీధి) మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో ఇళ్ల‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో గిరిజ‌న మ‌హిళ కొర్రి కుమారి (35) మృతి చెంద‌గా, ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో ఆరు ఇళ్లునేల‌మ‌ట్టం కాగా, 26 ఇళ్లు దెబ్బ‌తిన్నాయి.

సీలేరు జలాశయాలలో ప్రమాదకర స్థాయికి నీటి నిల్వలు చేరుకున్నాయి. డొంకరాయి డ్యామ్ 11 గేట్లు, ఫోర్ బే డ్యామ్‌ల పదిహేను గేట్లు ఎత్తి 1.10 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీటిని దిగువ‌కు జెన్కో అధికారులు విడుదల చేశారు. దీంతో లోత‌ట్టు ప్రాంతాలైన సూర‌న్న‌గొంది, మ‌ధుకూరు త‌దిత‌ర గ్రామాలు ముంపున‌కు గుర‌య్యాయి.

సీలేరు వరద నీటితో శబరి నదిలో నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాల నుంచి కింద‌కు వ‌ద‌ర నీటిని విడుద‌ల చేయ‌డంతో చింతూరు వ‌ద్ద శ‌బ‌రి న‌ది నీటిమ‌ట్టం 38 అడుగులు న‌మోదు అయింది. ప్ర‌మాద‌క‌ర స్థితికి చేరువ‌గా ఉంది. దీంతో శ‌బ‌రి ప‌రివాహ‌క ప్రాంతాలైన విఆర్‌. పురం మండ‌లంలోని చింత‌రేగుప‌ల్లి, క‌న్నాయిగూడెం, అడ‌వి వెంక‌న్న గూడెం, సోప‌ల్లి గ్రామాలను వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది.

రాక‌పోక‌లు బంద్

భారీ వర్షాల కారణంగా ఏజెన్సీకి రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వ‌ర్షాల‌తో చింతూరు మండ‌లంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతుంది. సుమారు 40 గ్రామాలు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వాగు ప్ర‌మాద‌క‌ర స్థాయికి పెరిగింది. గోదావ‌రి, శ‌బ‌రి న‌దులకు భారీగా వ‌ర‌ద నీరు రావ‌డంతో సోకిలేరు వాగు ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వాహిస్తుంది.

సోకిలేరు వాగులో పెద్ద‌పెద్ద చెట్టు, మోదుళ్లు కొట్టుకెళ్తున్నాయి. కుమ్మూరు వాగు, కొయ‌గూరు వాగు, చంద్ర‌వంక త‌దిత‌ర వాగులు పొంగి ప్రవ‌హిస్తున్నాయి. అన్న‌వ‌రం-ఉమ్మ‌డి వ‌రం మ‌ధ్య లోలెవెల్ బ్రిడ్జిపై నుండి వ‌ద‌ర నీరు ప్ర‌వ‌హించ‌డంతో సుమారు 40 గ్రామాల‌కు రాక‌పోక‌లు స్తంభించాయి. మాడుగుల - పాడేరు, నర్సీపట్నం - చింతపల్లి, వయా అనంతగిరి అరకు, రంపచోడవరం - మారేడుమిల్లి, చింతూరు డివిజన్‌లో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. అన్ని ఘాట్ రోడ్లలో రాకపోకలపై నిషేధం విధించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు. ముంచంగిపుట్టులోని జోలాపుట్‌, డుడుమ జ‌ల‌పాతాలు ప్ర‌మాద‌క‌రంగా మారాయి.

ఆర్టీసి బ‌స్సులు ర‌ద్దు

మారేడుమిల్లి, సిలేరు, కాకినాడ‌, రాజ‌మండ్రి, విశాఖ త‌దిత‌ర ప్రాంతాల‌కు ఆర్టీసి బ‌స్సులు ర‌ద్దు చేశారు. పోల‌వ‌రం ముంపు మండ‌లాల్లో గోదావ‌రి ప్ర‌వాహం పెర‌గ‌డంతో జీకే వీధి మండ‌లంలో 16 పంచాయ‌తీల్లో పంట పొలాలు నీట మునిగాయి. హుకుంపేట మండ‌లం చీడుపుట్టు, దిగుమొద‌పుట్టుల‌లో క‌ల్వ‌ర్టుల‌పై నీరు ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తోంది.

డుంబ్రిగుడ మండ‌లం గుంట‌సీమ‌, రంగిలిసింగి త‌దిత‌ర గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. ఉర‌క‌గెడ్డ నీరు ఎక్కువ‌గా రావ‌డంతో అన‌కాప‌ల్లి జిల్లా మాడుగుల మండ‌లం మామిడిపాలెం గ్రామ గిరిజ‌నులు జ‌ల దిగ్బంధంలో చిక్కుకున్నారు. గొలుగొండ మండ‌లం బొడ్డేరు, దార‌గెడ్డ‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి.

మాచ్‌ఖండ్ విద్యుదుత్ప‌త్తి కేంద్రంలోకి వ‌ర‌ద నీరు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో ఉన్న మాచ్‌ఖండ్ జ‌ల విద్యుత్ కేంద్రంలోకి వ‌ర‌ద నీరు చేరింది. ప్ర‌స్తుతం వినియోగంలో ఉన్న నాలుగు యూనిట్ల‌లోనూ విద్యుదుత్ప‌త్తిని నిలిపివేశారు. డీ-వాట‌రింగ్ పంపుల ద్వారా నీటిని బ‌య‌ట‌కు పంపేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్ దిగువ ప్రాంతంలో అలెర్ట్‌

వేగావ‌తి న‌ది ఉధృతికి విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి మండ‌లంలోని పారాది కాజ్‌వే కొట్టుకుపోయింది. బొబ్బిలి మున్సిపాలిటీలోని పూల్‌బాగ్ రోడ్డు చెరువ‌ను త‌ల‌పిస్తోంది. బ‌లిజిపేట రోడ్డులో యుద్ధ స్తంబం వ‌ద్ద రోడ్డుపై భారీ వృక్షం కూలిపోయింది. వేపాడ మండ‌లం సోంపురం జంక్ష‌న్ రైల్వే అండ‌ర్ బ్రిడ్జి వ‌ర్ష‌పు నీటితో నిండ‌టంతో మండ‌ల‌ కేంద్రానికి రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

న‌ల్ల‌బెల్లి గ్రామంలోని అనంత చెరువుకు గండి ప‌డింది. శ్రీకాకుళం జిల్లాలో 24 గంట‌ల్లో 10.5 మిల్లీ మీట‌ర్ల స‌గ‌టు వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. మ‌హేంద్ర‌త‌న‌య న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. కాజ్‌వేపై నుంచి వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుండ‌డంతో పాత ప‌ట్నం మండలంలో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు స్తంభించాయి.

జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్స్‌

ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, చేప‌డుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షించారు. వాహ‌నాలు, వ్య‌క్తులు వెళ్ల‌లేని ప్రాంతాల్లో డ్రోన్లను ఉప‌యోగించాల‌ని, కాలువ‌ల్లో వ‌ర‌ద ప్ర‌వాహాలు, గ‌ట్లు ప‌టిష్ట‌త‌ను డ్రోన్ల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు అంచనా వేయాల‌ని ఆదేశించారు. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, తూర్పుగోదావ‌రి, ఏలూరు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు ప‌లు సూచ‌న‌లు చేశారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner