Chandrababu Petitions: చంద్రబాబు పిటిషన్లపై కోర్టుల్లో కొనసాగుతున్న హైడ్రామా
Chandrababu Petitions: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహారంలో కోర్టుల్లో హైడ్రామా కొనసాగుతోంది. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రకరకాల పిటిషన్లపై విచారణ జరుగనుండటంతో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
Chandrababu Petitions: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్యాష్ పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం మెన్షన్ చేయాల్సిందిగా సీజే చంద్రచూడ్.. చంద్రబాబు న్యాయవాది లుథ్రాకు సూచించారు. అయితే మెన్షనింగ్ అవసరం లేకుండానే విచారణ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్యాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారని పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో నమోదైన కేసును కొట్టేయాలని స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
మరోవైపు అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద ఇరువర్గాల ఘర్షణలో తనను నిందితుడిగా చేర్చడంపై బాబు అభ్యంతరం చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని పిటిషన్‍లో పేర్కొన్నారు. తనను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‍లో పేర్కొన్నారు. చంద్రబాబుపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు కస్టడీపై నేడు విచారణ
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఈ పిటిషన్లపై సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు నుంచి మరింత సమాచారం రాబట్టడానికి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది.
ఈ నెల 23, 24 తేదీల్లో రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది. మొదటి రోజున ఒక పూటంతా విచారణ జరగలేదని ప్రస్తావించినట్లు తెలిసింది. చంద్రబాబు కొన్ని కాగితాలు అడిగారని.. వాటిని ఇచ్చామని.. ఆయన వాటిని చదువుతూ ఉండడంతో మధ్యాహ్న భోజన సమయం అయిందని.. ఆ తర్వాతే విచారణ మొదలైందని సీఐడీ తెలిపింది. ఫలితంగా ఒకటిన్నర రోజు మాత్రమే విచారణ సాగిందని.. కీలక సమాచారం రాబట్టడానికి మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. రెండ్రోజుల విచారణకు సంబంధించిన నివేదికను సీఐడీ సీల్డ్ కవర్‌లో ఏసీబీ కోర్టుకు సమర్పించింది.