VJA Murder: తండ్రి ప్రాణాలు బలి తీసిన కుమార్తె ప్రేమ.. ప్రేమికుడి ఘాతుకం, నడిరోడ్డుపై దారుణ హత్య-the love of the daughter who sacrificed her fathers life ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vja Murder: తండ్రి ప్రాణాలు బలి తీసిన కుమార్తె ప్రేమ.. ప్రేమికుడి ఘాతుకం, నడిరోడ్డుపై దారుణ హత్య

VJA Murder: తండ్రి ప్రాణాలు బలి తీసిన కుమార్తె ప్రేమ.. ప్రేమికుడి ఘాతుకం, నడిరోడ్డుపై దారుణ హత్య

Sarath chandra.B HT Telugu
Jun 28, 2024 06:37 AM IST

VJA Murder: విజయవాడలో దారుణ హత్య జరిగింది. కుమార్తె ప్రేమ వ్యవహారం తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. చదువు పూర్తి కాకుండా కూతురి జోలికి రావొద్దన్నందుకు ఓ తండ్రి బలయ్యాడు. ప్రేమికుడు నడిరోడ్డుపై దారుణంగా

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

VJA Murder: విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటోన్న కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించడమే పాపమైంది. నడిరోడ్డుపై కిరాతకంగా నరికి ప్రాణాలు తీశాడు. గురువారం రాత్రి పొద్దుపోయాక ఈ దారుణం జరిగింది. కుమార్తె కళ్లెదుటే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

విజయవాడ బృందావన్ కాలనీలో భవానీపురం చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.

రామచంద్రప్రసాద్‌ కుమార్తె నగరంలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువు తోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు కొన్నేళ్ల క్రితం ఇన్స్టా‌గ్రమ్‌లో యువతితో పరిచయం ఏర్పడింది.

వీరి విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను మందలించాడు. చదువుకుని జీవి తంలో స్థిరపడాలని సూచించాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను కూడా పలుమార్లు హెచ్చరించాడు. తండ్రి ఒత్తిడితో కొద్దిరోజులుగా ఆమె అతడిని పక్కనపెట్టింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని మణికంఠ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు.

ఇది తెలిసి శ్రీరామచంద్రప్రసాద్ కొంతమందితో వెళ్లి మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. అప్పటి నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మణికంఠ తీరుతో విసిగిపోయిన అతని తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ రామచంద్రప్రసాద్‌పై పగ పెంచుకున్నాడు.

గురువారం ఉదయం శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను వెంటబెట్టుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపుకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే రామచంద్రప్రసాద్‌పై దాడి చేసేందుకు కత్తితో బృందావన్‌ కాలనీలో మాటు వేశాడు. షాపుకు కొద్ది దూరంలో వేచి ఉన్నాడు. షాపు మూసేసి స్కూటర్‌పై బయల్దేరిన తండ్రి కూతుళ్లను బైక్‌తో వేగంగా వెళ్లి ఢీకొట్టాడు.

కింద పడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌ మీద కత్తితో దాడి చేశాడు. అతడిని అడ్డుకున్న కుమార్తె పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టడంతో మళ్లీ దాడి చేశాడు. కత్తితో పలుమార్లు నరకడం తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు విడిచాడు. తండ్రి ప్రాణాలను కాపాడేందుకు కుమార్తె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఆ తర్వాత తనను కాదంటే తనతో తిరిగిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తానని హెచ్చ రించాడు. ఆ ప్రాంతంలో పెద్దగా జనసంచారం లేకపోవడంతో యువతి అరుపులతో చుట్టుపక్కల వచ్చేసరికి పరారయ్యాడు. బాధితుడిని మొదట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసు పత్రి మార్చురీకి తరలించారు.

నిఘా లేదు, పెట్రోలింగ్ అసలే లేదు…

విజయవాడలో గత కొన్నేళ్లుగా నేరాల నిరోధానికి చర్యలు చేపట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. గతంలో రోడ్ల మీద పెట్రోలింగ్ కొనసాగేది. కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో కూడా భయం లేకుండా జనసంచారం కొనసాగేది. గత కొన్నేళ్లు పోలీసుల్లో నిర్లిప్తత, నిర్లక్ష్యం ఆవహించింది. స్టేషన్ల వారీగా సెటిల్‌మెంట్లు, ఆదాయ మార్గాల అన్వేషణ తప్ప లా అండ్‌ ఆర్డర్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ చెలరేగిపోతున్న వాటిని నియంత్రించే చర్యలు కొరవడ్డాయి. నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై వీధుల్లో వీరంగం చేస్తున్న వారిని కట్టడి చేసే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. తాజాగా నడిరోడ్డుపై జరిగిన దారుణ హత్య అందరిని కలిచి వేసింది.