Railway Safety: బెజవాడను రక్షించిన రైల్వేల ముందు చూపు..వరద కట్టలు పోయినా రైలు కట్టలు కాపాడాయి.-the flood embankments were lost but the railway embankments saved vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Safety: బెజవాడను రక్షించిన రైల్వేల ముందు చూపు..వరద కట్టలు పోయినా రైలు కట్టలు కాపాడాయి.

Railway Safety: బెజవాడను రక్షించిన రైల్వేల ముందు చూపు..వరద కట్టలు పోయినా రైలు కట్టలు కాపాడాయి.

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 06, 2024 09:46 AM IST

Railway Safety: బుడమేరు గరిష్ట ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన రైల్వే లైన్ల నిర్మాణమే విజయవాడ నగరాన్ని వరదల నుంచి కాపాడింది.విజయవాడ నగరం లో చాలా భాగం వరద ముంపుకు గురైనా మిగిలిన నగరాన్ని వరద నుంచి కాపాడటంలో రైల్వే లైన్లు కీలకంగా పనిచేశాయి.

ఆదివారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌‌పైకి చేరిన వరద నీరు
ఆదివారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌‌పైకి చేరిన వరద నీరు

Railway Safety: వరదల్లో విజయవాడ నగరంలో సగం ముంపుకు గురైతే మరో సగం ప్రాంతం మాత్రం సురక్షితంగానే ఉంది. నాలుగు రోజుల పాటు వరద ముంచెత్తినా కొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరలేదు. దీనికి దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే లైన్లు ప్రధాన పాత్ర పోషించాయి.

విజయవాడ నగరానికి ఎగువున కాజీపేట రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న ప్రాంతంలో బుడమేరు ప్రవాహం మొదలువుతుంది. విజయవాడ శివార్లలో ఉన్న కొండపల్లి వరకు కాజీపేట డివిజన్‌ పరిధిలోనే ఉంటుంది. అక్కడ నుంచి విజయవాడ డివిజన్‌ పరిధి ప్రారంభం అవుతుంది.

నిజాం కాలంలో చెన్నై-న్యూఢిల్లీ మధ్య గ్రాండ్ ట్రంక్‌ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టిన సమయంలోనే రైల్వేల లైన్ల నిర్మాణంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో వేర్వేరు సమయాల్లో చేపట్టిన రైల్వే లైన్ల ఆధునీకరణ పనుల్లో రైల్వే కట్టల్ని దశల వారీగా బలోపేతం చేస్తూ వచ్చారు.

ఆగస్టు 31వ తేదీ అర్థరాత్రి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సమయంలో బుడమేరు ప్రవాహం ఒక్కసారిగా నగరంపై విరుచుకుపడకుండా రైల్వే కట్టలు అడ్డుగా నిలిచాయి. ఈ క్రమంలో కొండపల్లి, రాయనపాడు, విజయవాడ నార్త్‌ క్యాబిన్‌ మీదుగా హైదరాబాద్‌ నుంచి విశాఖఫట్న వైపు నిర్మించిన లూప్‌ లైన్‌ బుడమేరు ప్రవాహాన్ని అడ్డుకుంది.

కవులూరు-రాయనపాడు-శాంతి నగర్‌ మధ్య బుడమేరుకు పలు ప్రాంతాల్లో గండ్లు పడటంతో వరద నీరు వేగంగా విజయవాడను ముంచెత్తింది. బుడమేరు కట్టలు తెగి ఉధృతంగా వరద నగరం వైపు ప్రయాణించింది. ఆ సమయంలో సగం నగరాన్ని కాపాడుతూ రైల్వే లైన్లు వరద తాకిడిని తట్టుకుని నిలిచాయి.

వరద ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మాణం

విజయవాడ రైల్వే స్టేషన్‌ సముద్ర మట్టానికి 19.354 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బుడమేరు ఉధృతికి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రానికి రైల్వే స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న నైజాం గేటు వరకు పట్టాలపైకి నీరు చేరింది. విజయవాడకు ఎగువున ఉన్న కొండ పల్లి రైల్వే స్టేషన్ మాత్రం 31.730 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాని తర్వాత ఉండే రాయనపాడు రైల్వే స్టేషన్ 21.340 మీటర్ల ఎత్తులో ఉంటుుంది.

సాధారణంగా రైల్వే లైన్లను నిర్మించేటపుడు భూమట్టానికి ఐదున్నర అడుగుల ఎత్తులో నిర్మాణం చేపడతారు. కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం రైల్వే లైన్ల నిర్మాణం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకునే వారు. విజయవాడ మీదుగా వెళ్లే గ్రాండ్ ట్రంక్ మార్గంతో పాటు, విశాఖపట్నం రైల్వే మార్గాలు రెండున్నర నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ భూములు ఉండటంతో పాటు తరచూ వర్షాలు, వరదలు ముంచెత్తే అవకాశం ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.

కోస్తా ప్రాంతంలో భూమట్టానికి ఎనిమిదిన్నర నుంచి 12 అడుగుల ఎత్తులో రైల్వే లైన్ల నిర్మాణం జరిగింది. సున్నితమైన ప్రాంతాలు, చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంన్న చోట ట్రాకుల్ని నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించారు.

విశాఖ‌పట్నం మార్గంలో రైల్వే ట్రాకులు భూమికి మూడున్నర మీటర్ల ఎత్తులో ఉంటాయి. విజయవాడలో కూడా రెండున్నర నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో రైల్వే ట్రాకుల నిర్మాణం జరిగింది. రాయనపాడులో రైల్వే స్టేషన్ సముద్రమట్టానికి 21.340 మీటర్ల ఎత్తులో ఉన్నా మూడడుగుల ఎత్తులో వరద ప్రవాహం ముంచెత్తింది. దీనిని బట్టి బుడమేరు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అదనపు భద్రతనిచ్చిన బల్బ్ లైన్

బుడమేరు నుంచి వచ్చే ముంపును దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిటిష్ కాలంలో విస్తరించిన రైల్వే లైన్ల నిర్మాణంలోనే ఈ జాగ్రత్తలు పాటించారు. 35ఏళ్ల క్రితం హైదరాబాద్-విశాఖపట్నం మార్గంలో నిర్మించిన లూప్‌లైన్ అదనపు భద్రతనిచ్చింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు ప్రయాణించే రైళ్లు సాధారణంగా విజయవాడలో ఇంజన్ దిశ మార్చుకుని ప్రయాణిస్తుంటాయి.

గూడ్స్‌ రైళ్లకు ఇది తీవ్ర సమస్యగా మారడంతో 80వ దశకంలో పాత రాజ రాజేశ్వరిపేట-కొత్త రాజరాజేశ్వరి పేట మీదుగా విశాఖమార్గాన్ని కలుపుతూ బల్బ్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ లైన్ నిర్మాణం జరిగిన తర్వాత సరకు రవాణా వాహనాలను విజయవాడ రాకుండానే హైదరాబాద్-కాజీపేట-విశాఖపట్నం మార్గంలో ప్రయాణించడానికి వీలైంది.

విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి పెరగడం, ప్రకృతి విపత్తలు, రైల్వే లైన్ల నిర్వహణ, మరమ్మతుల సమయంలో గత కొన్నేళ్లుగా ఈ లైన్‌లో ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నారు. గత ఆగస్టులో దాదాపు పక్షం రోజుల పాటు విశాఖ-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లన్నింటిని బల్బ్‌ లైన్‌ మీదుగానే నడిపారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఈ లైన్‌ను గుణదల స్టేషన్ మీదుగా, రామవరప్పాడు వరకు వెళుతుంది.

విజయవాడ నగరానికి వెలుపల ఉన్న ఈ పొడవైన రైల్వే నిర్మాణమే 31వ తేదీన వరద నగరంపై విరుచుకుపడకుండా అడ్డుపడింది. మధ్యలో ఉన్న నివాస ప్రాంతాలకు వరద పోటెత్తకుండా నియంత్రించింది.

Whats_app_banner

సంబంధిత కథనం