Rushikonda Palace : వామ్మో.. రుషికొండ భవనాలకు నెలకు ఇంత కరెంట్ బిల్లు వస్తుందా..!-the buildings on rushikonda get an electricity bill of rs 7 lakh per month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rushikonda Palace : వామ్మో.. రుషికొండ భవనాలకు నెలకు ఇంత కరెంట్ బిల్లు వస్తుందా..!

Rushikonda Palace : వామ్మో.. రుషికొండ భవనాలకు నెలకు ఇంత కరెంట్ బిల్లు వస్తుందా..!

Basani Shiva Kumar HT Telugu
Oct 20, 2024 05:15 PM IST

Rushikonda Palace : విశాఖపట్నం సమీపంలోని రుషికొండపై గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అక్కడ పనులు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో అప్పటినుంచి అక్కడ పెండిగ్ పనులు జరగడం లేదు. కానీ.. కరెంట్ బిల్లు మాత్రం లక్షల్లో వస్తోంది.

రుషికొండ భవనాలు
రుషికొండ భవనాలు

గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండపై రూ.500 కోట్లతో భవనాలను నిర్మించింది. అయితే.. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏ కార్యక్రమాల కోసం వాటిని వినియోగించడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవని కూటమి నేతలు చెబుతున్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు.

ప్రభుత్వానికి భారంగా..

ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకుందాం అనుకున్నా.. చాలా భారమవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ భవనాలను దేనికైనా వినియోగిస్తే కేవలం విద్యుత్‌ బిల్లులే నెలకు రూ.25 లక్షల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇంకా ఇతర నిర్వహణ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు.

రూ.85 లక్షల పెండింగ్..

గతేడాది నవంబర్ నుంచి రుషికొండలోని భవనాలకు కరెంట్‌ను వాడుతున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున రూ.7 లక్షల కరెంట్ బిల్లు వస్తోంది. అప్పటి నుంచి బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇప్పటి వరకు దాదాపు రూ.85 లక్షల బకాయిలు ఉన్నాయి. కేవలం రాత్రిపూట విద్యుద్దీపాలు వెలిగించినందుకే ఈ స్థాయిలో కరెంట్ బిల్లు వచ్చిందని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వినియోగిస్తే.. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

అడుగుకు రూ.30 వేలు..

ఐదు బ్లాకుల భవనాలను మొత్తం 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. చదరపు అడుగుకు సగటున రూ.30 వేలు ఖర్చు చేశారు. వీటిల్లో కొన్ని భవనాలకు మాత్రమే ఫర్నీచర్‌ సమకూర్చారు. అప్పటికే ఎన్నికలు వచ్చాయి. వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో.. పెండింగ్ పనులు ఆగిపోయాయి. మిగిలిన ఫర్నీచర్ ఎప్పుడు సమకూరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

భవనాలకు తాళాలు..

ప్రస్తుతం ఈ భవనాలకు తాళాలు వేసి ఉంచారు. కాపలా కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 10 నెలలుగా నిర్వహణ సరిగా లేకపోవడంతో దుమ్ము పట్టేశాయి. కొన్ని పరికరాలు తుప్పు పట్టాయి. సముద్రాన్ని ఆనుకొని ఉండడంతో.. ఉప్పు నీటి గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా.. సరైన నిర్వహణ లేకపోతే ఫర్నీచర్ పాడైపోయే అవకాశం ఉందని అంటున్నారు.

వేసవిలో అసెంబ్లీ సమావేశాలు..

ఈ భవనాలను ప్రభుత్వం వినియోగించుకోవాలనే డిమాండ్ ఉంది. ఖాళీగా ఉంచేకంటే.. ఏదైనా సంస్థకు ఇచ్చినా ఆదాయం వస్తుందనే వాదన ఉంది. లేకపోతే.. ఈ భవనాల్లో వేసవి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించవచ్చని స్థానికులు చెబుతున్నారు. అప్పుడైనా నిర్వహణ సరిగా ఉండి.. ఫర్నిచర్ పాడైపోకుండా ఉంటుందని అంటున్నారు. అలా కూడా వీలు కాకపోతే.. పర్యాటకుల కోసం అయినా అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.

Whats_app_banner