AP Govt on CBN Bail: బాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేయనున్న ఏపీ ప్రభుత్వం-the ap government will challenge the high courts bail grant to chandrababu in the supreme court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt On Cbn Bail: బాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

AP Govt on CBN Bail: బాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

Sarath chandra.B HT Telugu
Nov 21, 2023 06:02 AM IST

AP Govt on CBN Bail: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయాలని భావిస్తోంది. బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది.

చంద్రబాబు
చంద్రబాబు (HT_PRINT)

AP Govt on CBN Bail: చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బెయిల్‌ మంజూరు కావడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాబుకు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

బెయిల్‌ పిటిషన్‌ విచారణలో పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని, కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాల.. దర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యాఖ్యానించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.

సిఐడి దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని, తీర్పులో పేర్కొన్న వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.

కేసు దర్యాప్తు సందర్భంగా సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వ లేదని, కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్‌ కోర్టు అధికారాలను హరించడమేనని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విచారణ ప్రాథమిక దశలో ఉండగా ఇలాంటి పరిణామాలు ఆందోళనకరమైన విషయమని, బెయిల్‌ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుందని చెబుతోంది.

బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదని, దర్యాప్తు సమయంలో బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించారు.

హైకోర్టు తీర్పులోని 21వ పేరాలో టీడీపీ పార్టీ ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్టు కచ్చితమైన నిర్ధారణ లేదని నిర్ధారణకు రావడం తొందరపాటు ముగింపు అని ప్రభుత్వం భావిస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కేసులో సంబంధం ఉన్న వ్యక్తులు ఇప్పటికీ విచారణలో పాల్గొనలేదని, అడిగిన వివరాలను అందించ లేదని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

Whats_app_banner