Nandamuri Balakrishna in Assembly: సభలో బాలయ్య విజిల్స్, సర్టిఫైడ్ సైకో అన్న కన్నబాబు
Nandamuri Balakrishna in Assembly: టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో రెండో రోజు కూడా ఏపీ శాసన సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. చర్చకు సిద్ధమని ప్రకటించినా టీడీపీ సభ్యులు పోడియంను చుట్టు ముట్టడంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభ్యుల ఆందోళన కొనసాగింది.
Nandamuri Balakrishna in Assembly: ఏపీ శాసనసభ సమావేశాల్లో రెండో రోజు కూడా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హల్చల్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్థానంలో కూర్చున్న బాలకృష్ణ ఆ తర్వాత అక్కడే కుర్చీలో నిలబడి నిరసన తెలిపారు.
శాసనసభలో రెండోరోజూ చంద్రబాబు అరెస్టు అంశంపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు బుగ్గన, అంబటి, జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో బాలకృష్ణ విజిల్స్ వేయడంతో బాలకృష్ణకు కనీస అవగాహన లేకుండా సభలో ప్రవర్తిస్తున్నాడని మంత్రి కాకాణి విమర్శించారు. చంద్రబాబును కోర్టు విడుదల చేయాలా, అసెంబ్లీ విడుదల చేయాలా అనేది కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు నిరసన సందర్భంగా ఏపీ అసెంబ్లీలో విజిల్స్ ఊదుతూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హడావుడి చేశారు. మార్షల్స్ చుట్టుముట్టిన సమయంలో బాలకృష్ణ విజిల్స్ ఊదుతూ కనిపించారు. ఈ క్రమంలో “బాలకృష్ణకు మెంటల్.. సభకు రానివ్వొద్దని వైీసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు”. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. '
చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని, ఆయన అక్కడ కూర్చోవడం చూసి పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారన్నారు. మెంటల్ ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దని సూచించారు. సభ్యుల్ని తుపాకీతో కాల్చినా కేసులుండవని, టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ ఆస్పత్రికి తరలించాలన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ మీద స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి కన్నబాబు దేశం మొత్తం మీద మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఏకైక ప్రజాప్రతినిధి బాలకృష్ణ మాత్రమేనన్నారు. సర్టిఫైడో సైకో బాలకృష్ణ మాత్రమే అని, తొడగొట్టడం, మీసం మెలేయడం ఆయన వృత్తి ధర్మం అని చెప్పడం ఆయన మానసిక స్థితికి అద్ధం పడుతోందన్నారు. చంద్రబాబు కుర్చీలో కూర్చుని హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అటు మండలిలో కూడా టీడీపీ సభ్యుల నిరసన కొనసాగుతోంది. TDP సభ్యుల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చోకపోతే సస్పెండ్ చేస్తామని ఛైర్మన్ హెచ్చరించారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టిస్తుండటంతో ఎమ్మెల్యేలు అచ్చన్నాయుడు, బెందాళం అశోక్‌లను సభ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య, వెలగపూడి రామకృష్ణబాబులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభలో విజిల్స్ వేస్తూ గందరగోళం సృష్టించడంతో వారిని సస్పెండ్ చేశారు.
సభలో టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని తెదేపా నిర్ణయించింది. అధికార పక్షం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేపటి నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.గురువారం 16మంది సభ్యుల్ని సస్పెండ్ చేయగా, శుక్రవారం కూడా పలువురు సభ్యులపై వేటు పడింది.