AP Liquor Sales 2024 : ఎనీ టైమ్ లీక్కర్ కిక్కు.. తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం!
AP Liquor Sales 2024 : ఏపీలో నూతన మద్యం విధానం తెలుగు తమ్ముళ్లకు కాసుల పంట పండిస్తోంది. అదనపు ఆదాయం కోసం బెల్టు షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయిస్తున్నారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మిస్తూ.. జేబులు నింపుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేక.. బరితెగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చాలా రోజుల తర్వాత ప్రైవేట్ మద్యం షాపులు తెరుచుకున్నాయి. వీటి టెండర్ ప్రక్రియ మొదలు.. లాటరీ వరకు కూటమి నేతలు తమకు లాభం జరిగేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి లాటరీల ద్వారా షాపుల కేటాయింపు పూర్తయ్యింది. దీంతో అసలు దందాకు తెరలేపారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా మందుబాబుల జేబులకు చిల్లు పడుతోంది.
పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు..
ఏపీలోని పల్లెల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ- తెలంగాణ బార్డర్‌లో ఉన్న పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన యధేశ్చగా సాగుతోంది. ఇదేంటని ప్రశ్నించే వారు కూడా లేరు. మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అధికారికంగా రేట్లు ప్రకటించినా.. చాలా గ్రామాల్లో కూటమి నేతలు చెప్పిన ధరలే ఫైనల్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కూటమి నేతల కనుసన్నల్లో..
వందలాది గ్రామాల్లో కూటమి నేతల కనుసన్నల్లో దుకాణాల ఏర్పాటు జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పల్లెల్లో తమ అనుచరులతో నాయకులే దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో ఇబ్బందులు లేకుండా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఎమ్మార్పీ ధరల కంటే.. 20 నుంచి 30 రూపాయలు ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు.
తమ్ముళ్ల తన్నులాట..
బెల్టు షాపుల వ్యవహారం ఇప్పుడు కూటమిలో గొడవలు పెట్టిస్తోంది. వాటాల కోసం తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగుతున్నారు. వర్గాలుగా ఏర్పడి.. పోటాపోటీగా గొలుసు దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాలు మద్యం షాపుల కోసం తన్నుకున్నాయి. దెందులూరు, నూజివీడు, పోలవరం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
షాడో ఎమ్మెల్యేకు నజరాన..
బెల్టు షాపుల ద్వారా షాడో ఎమ్మెల్యేలకు భారీగా నజరానాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యే హవా నడుస్తోంది. కొన్ని గ్రామాల్లో వైన్స్‌కు మించిన ఏర్పాట్లతో బెల్టు షాపులు వెలిశాయి. కూటమి నాయకులు ప్రెస్టేజీకి తీసుకొని గొలుసు దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా షాడో ఎమ్మెల్యేలకు భారీగా డబ్బులు ముడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
సిండికేట్ మాయాజాలం..
మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి.. మాయాజాలం సృష్టిస్తున్నారు. అదనపు ఆదాయం కోసం వాడవాడలా బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తున్నారు. బెల్టు షాపుల కేటాయింపు కోసం అనధికార వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. వీటి కోసం లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. మండల స్థాయి నాయకులు గ్రామాలను పంచుకొని.. బెల్టు షాపుల దందా నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా 24 గంటలూ మద్యం సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.