Manda Krishna Letter : బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయండి, ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ
Manda Krishna Letter : ఎస్సీ వర్గీకరణకు సానుకూలత చూపిన బీజేపీకి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలకు లేఖ రాశారు.
Manda Krishna Letter : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీకి బిగ్ బూస్ట్ లభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయాలని, ఆ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలకు, నాయకులకు, కార్యకర్తలకు లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేసింది
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాదిగలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని మందకృష్ణ మాదిగ లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తమ వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వివిధ కమిషన్ల నివేదికలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కమిషన్ల నివేదికలను అనుసరించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని మాదిగలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏరోజు కూడా ముందుకు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం చేసిందన్నారు.
మాదిగలను కేసీఆర్ రాజకీయంగా అణచివేశారు
కమిషన్ల నివేదికలకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించకపోవడం, గత దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉండి ఏరోజు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తకపోవడం, వర్గీకరణ కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా రాయకపోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీ మాదిగలను ఏ స్థాయిలో విస్మరించిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తమ వర్గాన్ని మోసం చేయడమే కాకుండా తమ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేసీఆర్ ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో కనీసం చెప్పుకోవడానికి కూడా మాదిగలకు అవకాశం కల్పించలేదన్నారు. కేసీఆర్ మాదిగలను రాజకీయంగా అణచివేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు సానుకూలత చూపిన బీజేపీకి తమ మద్దతు అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్ , హైదరాబాద్