Nara Lokesh : శ్రీకాకుళంలో ఉద్రిక్తత… నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు
పలాస వెళుతున్న లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాశీబుగ్గ లో ఇళ్ళు కూల్చడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆందోళనకు దిగడంతో శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పలాస వెళుతున్న లోకేష్‌ను కొత్తకోట రోడ్డు జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. పలాస వెళ్ళేందుకు అనుమతి లేదని చెప్పడంతో లోకేష్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నారా లోకేష్‌ను పలాస వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కొత్తకోట కూడలికి తరలి వచ్చారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణుల్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
ఇళ్ల తొలగింపుతో రగడ….
పలాసలో గత వారం ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చి వేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అశోక్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారని బాధితుల్ని పరామర్శించేందుకు నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం రాత్రి చెరువు స్థలంలో ఇళ్లను నిర్మించారని ఆరోపిస్తూ 27వ డివిజన్ కార్పొరేటర్, టీడీపీ నాయకుడు సూర్యనారాయణ ఇంటిని కూల్చి వేసేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ తలెత్తింది.
మరోవైపు మంత్రి సీదిరి అప్పలరాజుపై పలాస నియోజక వర్గ ఇన్‌ఛార్జి గౌతు శిరీష అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు చెప్పకపోతే టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైసీపీ హెచ్చరించింది. వైసీపీ డిమాండ్‌ను టీడీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయంలో ఉంటామని ఎలా ముట్టడిస్తారో చూస్తామంటూ గౌతు శిరీష ఎదురు దాడికి సిద్ధమయ్యారు. టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్‌ను పరామర్శించేందుకు నారా లోకేష్ పలాస రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో ఆదివారం ర్యాలీలు, బహిరంగ సభలకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో 144సెక్షన్ అమల్లో ఉందని ప్రకటించారు.
జగన్‌పై లోకేష్ విమర్శలు…..
జేసీబీ రెడ్డి తమ పర్యటనను అడ్డుకుంటున్నారని టీడీపీ నేత లోకేష్ విమర్శించారు. పలాస వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుకోవడాన్ని లోకేష్ తప్పు పట్టారు. పలాస తప్ప ఎక్కడికైనా వెళ్లొచ్చు అనడాన్ని లోకేష్ ప్రశ్నించారు. పశువుల శాఖ మంత్రి పలాసలో కూర్చుని పోలీసులతో డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు. పలాస పాకిస్తాన్ కాదని తాను ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు. దీంతో కొత్త రోడ్ జంక్షన్‌లో పోలీసులు లోకేష్‌ను అడ్డుకున్నారు. లోకేష్ వాహనం చుట్టూ కార్యకర్తలు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరోవైపు పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు నిరసన ఎదురైంది. ఇళ్ల తొలగింపు స్థానికులు మంత్రిని నిలదీశారు. చెరువు స్థలంలో కౌన్సిలర్ అక్రమంగా నిర్మించిన నాలుగు ఇళ్లను మాత్రమే తొలగిస్తారని మంత్రి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
టాపిక్