Vallabhaneni Vamsi to Mohali: మొహాలికి వల్లభనేని వంశీ.. రాజమండ్రి జైలుకు పట్టాభి
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ పంజాబ్‌లోని మొహాలీ Mohali వెళ్లిపోయారు. పట్టాభి కూడా గన్నవరం నుంచి రాజమండ్రి వెళ్లారు. గన్నవరం గొడవల తర్వాత ఎమ్మెల్యే వ్యక్తిగత పనుల కోసం ఊరు విడిచి వెళితే, టీడీపీ నాయకుడు పట్టాభిని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి సబ్ జైలుకు మార్చారు.
Vallabhaneni Vamsi to Mohali: గన్నవరం గరంగరం పాలిటిక్స్‌కు ఎమ్మెల్సీ వల్లభనేని వంశీ విరామం ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు హాట్ కామెంట్స్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వల్లభనేని వంశీ ముందే ఫిక్స్ చేసుకున్న కార్యక్రమంలో భాగంగా పంజాబ్ వెళ్లిపోయారు. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అక్కడ పోలీసులపై దాడులకు కారణమయ్యారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన పట్టాభిని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గన్నవరంలో జరిగిన ఘర్షణల్ని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసుల్ని దుర్భాసలాడటం, విధి నిర్వహణలో ఉన్న గన్నవరం సిఐను కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో పట్టాభిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం గన్నవరం సబ్ జైలుకు పట్టాభిని తరలించగా అక్కడి నుంచి మిగిలిన నిందితులతో కలిపి రాజమండ్రి తరలించారు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీ మాత్రం ప్రశాంతంగా తన పనుల కోసం పంజాబ్ వెళ్ళిపోయారు. పంజాబ్‌లోని మొహాలీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB Mohali క్యాంపస్‌లో పబ్లిక్ పాలసీ Public Policyలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందిన వంశీ ఇప్పటికే రెండు భాగాల కోర్సును పూర్తి చేశారు. గత ఏడాది మార్చిలోనే మూడో భాగాన్ని పూర్తి చేయాల్సి ఉంది. గత ఏడాది మొహాలీ వెళ్లిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కోర్సు పూర్తి చేయకుండానే హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. శిక్షణ, తుది ప్రాజెక్టును సమర్పించకపోవడంతో ఐఎస్‌బీ పబ్లిక్ పాలసీ కోర్సును పూర్తి చేయలేకపోయారు.
దీంతో గత ఏడాది పూర్తి చేయలేకపోయిన కోర్సును 2022-23 బ్యాచ్‌తో కలిసి పూర్తి చేయనున్నారు. ఐఎస్‌బి పబ్లిక్ పాలసీ కోర్సును వృత్తి నిపుణులతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అడ్మిషన్లు లభిస్తుంది. ఏడాది వ్యవధి ఉండే కోర్సుకు దాదాపు రూ.25లక్షల వరకు ఫీజు ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కోర్సును నిర్వహిస్తుంటారు,. ఐఎస్‌బి మొహాలీ, హైదరాబాద్ క్యాంపస్‌లలో కోర్సును నిర్వహిస్తుంటారు.
కోర్సు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న వంశీ, ఇప్పటికే అసైన్‌మెంట్లను పూర్తి చేసుకుని ఫైనల్ పార్ట్ పూర్తి చేసుకునేందుకు మొహాలీ వెళ్లారు. రేపటి నుంచి మార్చి 4వ తేదీ వరకు తుది షెడ్యూల్ జరుగనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు జరిగే ఫైనల్ మాడ్యూల్ శిక్షణ తర్వాత విద్యార్దులు వారి ప్రాజెక్టులను ఐఎస్‌బికి సమర్పించాల్సి ఉంటుంది. సాంప్రదాయక కోర్సులకు పూర్తి భిన్నంగా ఉండే కోర్సులో విద్యార్దులు సమర్పించే నివేదికలు, ప్రాజెక్టుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడిస్తారు. కోర్సు పూర్తి చేయడం ద్వారాా వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగు పరచుకోవడంతో పాటు రాజకీయాల్లో మరింత రాణించవచ్చని వంశీ భావిస్తున్నారు.
మరోవైపు గన్నవరం గొడవలతో పాటు వల్లభనేని వంశీకు ముప్పు ఉంటుందనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా సిబ్బందిని ఇప్పటికే పంజాబ్ పంపారు. మూడ్రోజుల క్రితమే ఎమ్మెల్యే వంశీ రక్షణ కోసం నలుగురు సాయుధ సిబ్బందిని పోలీస్ శాఖ పంజాబ్ పంపించినట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్య విద్యలో పట్టభద్రుడైన వల్లభనేని వంశీ ఐఎస్‌బి పబ్లిక్ పాలసీ కోర్సు ద్వారా విద్యార్హతలు పెంచుకోవాలని భావించారు.
ప్రతిష్టాత్మక కోర్సులో అడ్మిషన్ లభించడానికి శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి బ్యాచ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కోర్సు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుత బ్యాచ్‌లో పలువురు ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల నుంచి వృత్తి నైపుణ్యం, అనుభవం ఉన్న వారిని కోర్సుకు ఎంపిక చేస్తుంటారు. కోర్సు పూర్తైన తర్వాత ఇతర కార్యక్రమాల నేపథ్యంలో మార్చి 6,7 తేదీల వరకు వంశీ నియోజక వర్గానికి అందుబాటులో ఉండరని సమాచారం. నియోజక వర్గ ప్రజల కోసం కార్యాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విజయవాడ నుంచి మొహాలికి నేరుగా విమానం లేకపోవడంతో, విజయవాడ నుంచి బెంగుళూరు మీదుగా మొహాలికి బయల్దేరారు. మధ్యాహ్నానికి మొహాలీ చేరుకోనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్