Chandrababu Case To CBI : చంద్రబాబు స్కిల్ కేసు దర్యాప్తు సీబీఐకి, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!-tdp chief chandrababu skill development case may transfer to cbi ap govt says no objection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Case To Cbi : చంద్రబాబు స్కిల్ కేసు దర్యాప్తు సీబీఐకి, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Chandrababu Case To CBI : చంద్రబాబు స్కిల్ కేసు దర్యాప్తు సీబీఐకి, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Bandaru Satyaprasad HT Telugu
Oct 14, 2023 01:48 PM IST

Chandrababu Case To CBI : చంద్రబాబు అభియోగాలు ఎదుర్కొంటున్న స్కిల్ కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తామని వెల్లడించింది. ఉండవల్లి పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ ఈ మేరకు వాదనలు వినిపించారు.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Case To CBI : టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సీబీఐకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. స్కిల్ కేసులో ఇప్పటికే ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ విచారణ సందర్భంగా స్కిల్ కేసులో సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వొకేట్ జనరల్ తెలిపినట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు 36 రోజులుగా రాజమండ్రి సెంట్రలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే స్కిల్ కేసులో దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. సీబీఐ దర్యాప్తు కోరుతూ నిర్ణయం తీసుకోవాలని కోర్టులను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

yearly horoscope entry point

సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్

మాజీ సీఎం చంద్రబాబు అభియోగాలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తును కేంద్ర సంస్థలకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇతర సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎ.వి. రవీంద్రబాబుల డివిజన్ బెంచ్ కు ఈ కేసును సీబీఐ విచారణకు ఎందుకు అప్పగించాలో వరుస కారణాలను సమర్పించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ యారగొర్ల వాదనలు వినిపించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు సంబంధించి దర్యాప్తు చుట్టూ రాజకీయ వివాదాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిందని, రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ సర్వెంట్లతో సహా వివిధ వ్యక్తులు ఈ కేసు విషయంలో ఒక సైడ్ వహించారని ఆయన అన్నారు. రాజకీయ ప్రతీకారం ఆరోపణలు వస్తుందన్న స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేస్తే కేసుకు మేలు జరుగుతుందని వాదించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదు

ఈ కేసు సంక్లిష్టత కారణంగా, వివిధ స్థాయిల్లోని అధికారుల ప్రమేయం ఉన్నందున, దర్యాప్తును, ఇటువంటి నేరాలను ఛేదించడంలో నైపుణ్యం కలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషనర్ వాదించారు. ఆర్థిక నేరం, మనీలాండరింగ్, ఉన్నత కార్యాలయాలలో అవినీతిని వెలికితీసేందుకు సహాయపడుతుందని ఉండవల్లి తరఫు న్యాయవాది వాదించారు. చివరగా ఈ కేసు ఇప్పటికే 5 సంవత్సరాలుగా నడుస్తోందని, డబ్బులను త్వరగా రికవరీ చేయడానికి, పరిహారం సక్రమంగా చెల్లించడానికి కేంద్ర దర్యాప్తు సరైనదని కోర్టుకు తెలిపారు. అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఈ పిటిషన్‌పై అభ్యంతరం లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. కేసును సీబీఐకు అప్పగించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

Whats_app_banner