CM Jagan Review : పంట కొనడంలేదన్న మాట వినబడకూడదు, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి - సీఎం జగన్
CM Jagan Review : రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారులు చర్యలు ఉండాలన్నారు.
CM Jagan Review : ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో... వర్షాల కారణంగా పంట నష్టం, ఇతర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్నారు. వర్షాల వల్ల రైతులకు కలిగిన పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే నిరంతరం వివరాలు తెప్పించుకోవాలన్నారు.
పంట కొనుగోలు చేయడంలేదన్న మాట వినబడకూడదు
"రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇది పూర్తిస్థాయిలో జరగాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం ప్రదర్శించాలి. ఎవరైనా మిగిలిపోయినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. పంట నష్టపోయిన ఏ రైతుకు కూడా పరిహారం అందలేదనే మాట రాకూడదు. రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలి. పంట కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. రైతులకు ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే.. వాటిని తెలిపేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలి. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారులు చర్యలు ఉండాలి" - సీఎం జగన్
కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్
రాష్ట్రంలో అకాల వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం చేపట్టారు. నిన్న ఉత్తరాంధ్ర పర్యటన నుంచి తిరిగి రాగానే సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ధాన్యం నిల్వలు ఉంటే వాటిని అందుబాటులోని గోడౌన్లకు, ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చులకు ప్రతి కలెక్టర్‌కు రూ.కోటి ఇప్పటికే కేటాయించామన్నారు. అధికారులు వాటిని వినియోగించుకుంటురాని సీఎం జగన్ కు స్పష్టం చేశారు. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.