Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకి బదిలీ-supreme court transfers erra gangireddy bail cancel petition to telangana high court in viveka murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Supreme Court Transfers Erra Gangireddy Bail Cancel Petition To Telangana High Court In Viveka Murder Case

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకి బదిలీ

HT Telugu Desk HT Telugu
Jan 16, 2023 12:28 PM IST

Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పటిషన్ ను తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ అంశంలో అన్ని అంశాలను పరిశీలించి బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను సుప్రీం కోర్టే తెలంగాణకు బదిలీ చేసిందని... గంగిరెడ్డి బెయిల్ రద్దు పై తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు కింద స్థాయి కోర్టు మెరిట్ ను పరిగణలోకి తీసుకోలేదని.. ఈ అంశంలో విచారణ జరిపి, అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకి.. సుప్రీం ధర్మాసనం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి కడప ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు కోరుతూ ఏపీ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా.. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో.. సీబీఐ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల చేతిలో విచారణ ఉన్నప్పుడు... బెయిల్ వచ్చిందని.. సుప్రీం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. బెయిల్ మంజూరులో దిగువ కోర్టులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని... ఈ కేసులో మరింత లోతుగా విచారణ అవసరమని.. ఈ మేరకు ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుని సీబీఐ కోరింది. ఆయనని విచారిస్తే తప్ప... ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావని పేర్కొంది. అయితే.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని.. గంగిరెడ్డి దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు... బెయిల్ రద్దు పిటిషన్ ను కూడా తెలంగాణ హైకోర్టుకే బదిలీ చేస్తున్నట్లు పేర్కొంటూ తీర్పునిచ్చింది.

2019, మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 30 ఏళ్ల పాటు వివేకాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు ప్రణాళిక జరిగిందని.. హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారని ఇతర నిందితులకి గంగిరెడ్డి చెప్పినట్లు అభియోగాలు ఉన్నాయి. 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ లను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వివేకా హత్య సమయంలో రక్తపు మరకలు తుడిచేసినట్లు అభియోగాలు నమోదు చేశారు. 90 రోజుల పాటు కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకి.. 2019 జూన్ 27న పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం.. ఈ కేసు సీబీఐకి బదిలీ కాగా... బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే... ఏపీ హైకోర్టు ఇందుకు నిరాకరించగా... సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ఏపీలో జరిగితే న్యాయం జరగదని వివేకా కుమార్తె, సతీమణి వ్యక్తం చేసిన ఆందోళన సరైనదనే భావిస్తున్నామని, అందుకే విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మారుస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఏపీలో జరుగుతున్న విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

IPL_Entry_Point