Tirumala : ఈ నెల 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు-srivari salakatla teppotsavams will be held from march 20 in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఈ నెల 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala : ఈ నెల 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala Tirupati Devasthanams Updates : తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై(Srivari Salakatla Teppotsavams) ప్రకటన చేసింది టీటీడీ.మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

తిరుమల

Tirumala Srivari Salakatla Teppotsavams 2024: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Srivari Salakatla Teppotsavams) మార్చి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఓ ప్రకటనలో వెల్లడించింది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారుని తెలిపింది.

  • తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
  • రెండవ రోజు మార్చి 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
  • మూడవరోజు మార్చి 22న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు.
  • ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 23న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 24వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

తెప్పోత్సవాల(Srivari Salakatla Teppotsavams 2024) కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

సర్వదర్శనానికి 12 గంటల సమయం

ఇవాళ తిరుమలలోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,446గా ఉంది. 28,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లుగా ఉంది.

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మార్చి 10వ తేదీ ఆదివారం 18వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయోధ్యకాండలోని 26 నుండి 30వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 156 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 181 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

మార్చి 10న త్రిశూలస్నానం :

బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 10వ తేదీ ఆదివారం త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.