Srisailam Maha Shivratri Brahmotsavam: 11 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. శివభక్తులకు స్పర్శ దర్శనాలు
Sri Bhramaramba Mallikarjuna Swamy Temple: ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కీలక మార్పులు తీసుకువచ్చారు.
Srisailam Maha Shivratri Brahmotsavam 2023: మహాశివరాత్రి... దేశవ్యాప్తంగా శివాలయాలకు భారీగా తరలివచ్చే పండగ. భక్తులు ఉపవాసాలు ఉండి.. శివాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రంతా జాగారం కూడా చేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే... ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అందులోనూ ఏపీలోని శ్రీశైలం ప్రత్యేకమని చెప్పొచ్చు. సాధారణ భక్తులతో పాటు శివ మాల ధరించిన భక్తులు భారీగా తరలివస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా... శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈసారి ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహోత్సవాలను నిర్వహించేదుకు ముహుర్తం ఖరారు చేశారు. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల ముందు 9వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత 23వ తేదీ వరకు 15 రోజులపాటు శివ స్వాములు జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇరుముడి ధారణస్వాములకు మాత్రం 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ధిష్ట వేళలో మల్లిఖార్జునిడి స్పర్శదర్శనం కల్పించనున్నారు.
సీఎంకు ఆహ్వానం…
శ్రీశైలం మహాశిరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆలయాధికారులు ఆహ్వానించారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న, పాలక మండలి ఛైర్మన్, సభ్యులు, ఆలయ అర్చకులు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనాలు అందించి, శాలువతో సత్కరించారు.