Sathya Sai Accident : శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం, భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భర్త మృతి
Sathya Sai Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు, భార్యను బస్సులో పంపి, అతడు బైక్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భర్త అనంతలోకానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, భార్యను బస్సు ఎక్కించి అనంతపురానికి పంపించిన తరువాత, రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని పట్నం గ్రామంలో చోటు చేసుకుంది. పట్నం గ్రామానికి చెందిన భాస్కర్ (24) ఉపాధి కోసం అనంతపురం వెళ్లి అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అక్కడ పాల వ్యాను డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే ఆయన భార్య గర్భిణీ కావడంతో ఆమె సీమంతం నిమిత్తం స్వగ్రామమైన పట్నానికి శనివారం వెళ్లారు. ఆదివారం బంధువులు, మిత్రులతో కలిసి సీమంతం వేడుక, విందు కార్యక్రమం సంతోషంగా గడిపారు.
కార్యక్రమం ముగిసిన తరువాత చుట్టాలు, బంధువులు వెళ్లిపోయారు. సోమవారం తల్లిదండ్రులు, భార్య లక్ష్మిని మీరు ముందు బస్సు మీద వెళ్లిపోండి, తాను సొంతూరులో పనులు ముగించుకుని వస్తానని రాత్రికి ద్విచక్ర వాహనంపై వచ్చేస్తానని చెప్పాడు. అందుకు భార్య, తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో వారిని బస్సు ఎక్కించారు. సొంతూరులో పనులు ముగించుకుని సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురం బయలుదేరాడు. నిమిషాల వ్యవధిలోనే హంద్రీనీవా కాలువ మోరీ వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కదిరి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భార్య సీమంతం కార్యక్రమంలో బంధువులు, కుటుంబ సభ్యులు సందడిగా గడిపిన ఆ ఇంట విషాదం అలుముకుంది. భాస్కర్ మరణ వార్త తెలుసుకున్న భార్య లక్ష్మి, తల్లిదండ్రులు, గుండెలు పగిలేలా రోదించారు. మమ్మల్ని బస్సు ఎక్కించి, బైకులో వస్తానంటూ పాడెక్కావా భాస్కరా అంటూ తల్లిదండ్రుల రోధనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న కదిరి రూరల్ పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్ తెలిపారు.
నెల్లూరు జిల్లాలో
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లిలో వధూవరులను ఆశ్వీరదించి తిరిగి సొంతూరికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఐదుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన వలేటివారి పాలెం మండలంలోని పోకూరుకు చెందిన వారు కొంత మంది నలదలపూరు గ్రామంలో జరిగిన లింగాబత్తిన సులోచన మనవరాలు వివాహనానికి హాజరయ్యారు. అనంతరం వధూవరులను వారు ఆశ్వీరదించారు. అనంతరం సోమవారం తెల్లవారు జామున తిరిగి కారులో పోకూరుకు బయలు దేరారు.
బయలుదేరిన కొద్ది సేపటికే సమీపంలోనిమలుపు వద్ద కారు అదుపు తప్పి దిగువ పొలం గట్టుకు ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో ఉన్న లింగాబత్తిన సులోచన (53), కాలే సామ్రాజ్యం (65) ముందు సీటుకు బలంగా ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పులి సుకుమార్ కాలుకు తీవ్ర గాయం అయింది. పర్రె కొండమ్మ, తుమ్మ అమరావతి, ప్రియదర్శిని, ఉదయశ్రీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు పాలైన వారిని కందుకూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మరిదినాయుడు తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం