Tirumala: మార్చిలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే…
TTD Latest News: మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది.
Special Festivals at Tirumala: వచ్చే నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది. మార్చి 3వ తేదీన శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, - మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు.
- మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
- మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
- మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి.
- మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.
- మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
- మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం.
- మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం.
సాలకట్ల తెప్పొత్సవాలు....
మార్చి 3 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. తెప్పలపై స్వామివారు పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు. ఇక మూడవరోజు మార్చి 5న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 6న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతోన్న టీటీడీ... శ్రీవారి లడ్డూ (Srivari Laddu) ప్రసాదాన్ని ఇకనుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించే దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ తయారు చేసిన బుట్టలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి శనివారం (ఫిబ్రవరి 25న) అందజేశారు. వివిధ సైజుల్లో ఉన్న బుట్టలను పరిశీలన కోసం ఇచ్చారు. వీటిని పరిశీలించిన టీటీడీ ఈవో .. ఈ బుట్టలను త్వరలోనే లడ్డూ కౌంటర్లలో వాడకంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వీటి వాడకం ద్వారా కలిగే ప్రయోజనాలు, భక్తుల సౌకర్యం, వినియోగ సాధ్యాలను పరిశీలిస్తామని... భక్తులకు ఎంత మేర ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అధ్యయనం చేసి... పూర్తిగా స్థాయిలో వినియోగంలోకి తెస్తామని చెప్పారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో తాటాకు బుట్టలను వినియోగించడం ద్వారా... వాటిని తయారు చేసే వారికి ఉపాధి కల్పించి చేయూత అందించినట్లు అవుతుందని.. అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుందని టీటీడీ భావిస్తోంది.
సంబంధిత కథనం