TTD Super Speciality Hospital : త్వరలో టీటీడీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు-ttd will start super speciality children hospital with 250crores and succesfully completed heart transplantation for a boy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Will Start Super Speciality Children Hospital With 250crores And Succesfully Completed Heart Transplantation For A Boy

TTD Super Speciality Hospital : త్వరలో టీటీడీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 11:35 AM IST

TTD Super Speciality Hospital టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అతి త్వరలో వైద్య సూవలు ప్రారంభించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పేద పిల్లల ప్రాణాలు కాపాడటానికి రూ 250 కోట్లతో శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో అవయవాల మార్పిడి కోసం సకల సదుపాయాలతో పాటు ఎయిర్ అంబులెన్స్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు తెలిపారు.

త్వరలో టీటీడీ చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య సేవలు
త్వరలో టీటీడీ చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య సేవలు

TTD Super Speciality Hospital చిన్న పిల్లల కోసం టీటీడీ నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి సకల సదుపాయాలతో పాటు ఎయిర్ అంబులెన్స్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో తొలి చిన్న పిల్లల గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న విశ్వేశ్వర్ ను టీటీడీ చైర్మన్ పరామర్శించారు. చిన్నారికి వైద్య చికిత్స అందించిన వైద్యులను వైవి సుబ్బారెడ్డి అభినందించారు.

రాష్ట్రంలో పేద పిల్లల ప్రాణాలు కాపాడటానికి ీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రూ 250 కోట్లతో నిర్మిస్తున్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకుని వస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు. ఈ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి అవసరమైన అన్ని సదుపాయాలతోపాటు హెలిపాడ్ కూడా నిర్మిస్తామని తెలిపారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం - గుండె చికిత్సల ఆసుపత్రిలో జనవరి 20వ తేదీన రాష్ట్రంలోనే తొలి చిన్న పిల్లల గుండె మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కెఎస్ ఆర్ అగ్రహారం కు చెందిన 15 సంవత్సరాల విశ్వేశ్వర్ కు వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జేఈవో సదా భార్గవితో కలసి ఆసుపత్రిలో విశ్వేశ్వర్ తో పాటు అతని తల్లి రాధమ్మను పరామర్శించారు.

గుండె మార్పిడి ఆపరేషన్ లో పాల్గొన్న వైద్య బృందంతో ఆపరేషన్ జరిగిన విధానం పై మాట్లాడారు. రాష్ట్రంలో చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఆసుపత్రి లేని లోటు తీర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2021 అక్టోబర్‌ 11వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభించామని తెలిపారు.

75 పడకలు గల ఆసుపత్రిలో ఐసియు పడకలు, 3 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, అధునాతన క్యాథ్‌ ల్యాబ్‌ ఉన్నాయన్నారు. డా.వై.ఎస్‌.ఆర్‌.ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకాల కింద కేవలం 15 నెలల కాలంలోనే 1110 మంది చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

విశ్వేశ్వర్ కు గుండె పూర్తిగా దెబ్బతిన్నందువల్ల గుండె మార్పిడి చేయాల్సి ఉందని చిన్నపిల్లల గుండె ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారన్నారు. విశాఖపట్నంలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను దానం చేయడానికి కుటుంబసభ్యులు సిద్ధంగా ఉన్నారని జీవన్ దాన్ ద్వారా తెలుసుకుని వారితో సంప్రదించారన్నారు.

బాలుడి ప్రాణాలు కాపాడాలనే పట్టుదలతో వైద్యులు తిరుపతి నుండి కారులో విశాఖ వెళ్ళి అక్కడ గుండె తీసుకుని విమానంలో నాలుగు గంటల్లోగా ఆసుపత్రికి తీసుకుని వచ్చి విశ్వేశ్వర్ కు అమర్చారని తెలిపారు. చిన్నపిల్లల గుండె ఆసుపత్రి డైరెక్టర్డాక్టర్‌ ఎన్‌.శ్రీనాథ్‌ రెడ్డి - సీనియర్‌ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ పీడియాట్రిక్‌ సి.టి. సర్జన్‌ డాక్టర్‌ కె.గణపతి సుబ్రమణ్యం, పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ అనస్థీటిస్ట్‌ డాక్టర్‌ ఎ.మధు యాదవ్‌, జీవన్ దాన్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ రాంబాబు బృందం తో ఇతర వైద్య నిపుణులు,సిబ్బంది శ్రమించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశారని చైర్మన్ అభినందించారు.

గుండె తరలింపు కోసం విశాఖ పట్నం,తిరుపతి జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఎయిర్‌పోర్టు నుండి ఆసుపత్రి వరకు ప్రత్యేక గ్రీన్‌కారిడార్‌ ఏర్పాటుచేసి నిర్దేశిత వ్యవధిలో గుండెను తీసుకొచ్చేలా కృషి చేసిన వారందరినీ అభినందించారు. మరో నాలుగైదు రోజుల్లో విశ్వేశ్వర్ ను డిశ్చార్జ్ చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి , చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ భరత్ తో పాటు ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

టీటీడీ బడ్జెట్‌కు అమోదం….

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం స్థానిక అన్నమయ్య భవనంలో జరిగింది. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సభ్యులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2023-24 టీటీడీ బడ్జెట్‌ను ఆమోదించారు. సమావేశంలో సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కాకుండా సాధారణ పరిపాలన సంబంధమైన తీర్మానాలపై మాత్రమే సభ్యులు చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో బోర్డు తీర్మానాలు, బడ్జెట్‌ వివరాలను తితిదే ఛైర్మన్‌ మీడియాకు వెల్లడించలేదు. కోడ్‌ ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు వెల్లడించనున్నారు.

IPL_Entry_Point

టాపిక్