Tirumala Laddu : తాటాకు బుట్టల్లో శ్రీవారి లడ్డూలు.. టీటీడీ మరో వినూత్న ఆలోచన-ttd planning to distribute srivari laddus in palm leaf baskets as a part of eco friendly measures
Telugu News  /  Andhra Pradesh  /  Ttd Planning To Distribute Srivari Laddus In Palm Leaf Baskets As A Part Of Eco Friendly Measures
తాటాకు బుట్టల్లో శ్రీవారి లడ్డు
తాటాకు బుట్టల్లో శ్రీవారి లడ్డు

Tirumala Laddu : తాటాకు బుట్టల్లో శ్రీవారి లడ్డూలు.. టీటీడీ మరో వినూత్న ఆలోచన

25 February 2023, 19:54 ISTHT Telugu Desk
25 February 2023, 19:54 IST

Tirumala Laddu : పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ వృత్తులకు చేయూత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. భక్తులకి శ్రీవారి లడ్డూలను తాటాకు బుట్టల్లో అందించేందుక చర్యలు చేపట్టింది. ఈ మేరకు పలు రకాల బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

Tirumala Laddu : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) .. ప్రకృతి, పర్యావరణ హిత చర్యలపై దృష్టి సారించింది. సహజ పద్ధతులకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా... ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. లడ్డూ సహా ఇతర ప్రసాదాల తయారీలోనూ గణనీయ మార్పులు తీసుకొచ్చింది. ప్రకృతి వ్యవసాయ (Natural Farmers) రైతుల నుంచి శనగలు, బెల్లం, ధాన్యం తదితర ఆహార పదార్థాలను సేకరిస్తోంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులతో ఒప్పందం చేసుకున్న టీటీడీ (TTD)... రైతులకి మద్దతు ధరలు ఇచ్చి.. పంటలు సేకరిస్తోంది. ఆ పదార్థాలనే .. ప్రసాదాల తయారీలో ఉపయోగిస్తోంది. ఈ విధానం ద్వారా అటు రైతులకి మంచి ఆదాయం సమకూరడంతో పాటు... భక్తులకి సహజ పంటలతో తయారు చేసిన ప్రసాదాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే.. మరో వినూత్న ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చేందుకు సిద్ధమైంది టీటీడీ.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతోన్న టీటీడీ... శ్రీవారి లడ్డూ (Srivari Laddu) ప్రసాదాన్ని ఇకనుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించే దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ తయారు చేసిన బుట్టలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి శనివారం (ఫిబ్రవరి 25న) అందజేశారు. వివిధ సైజుల్లో ఉన్న బుట్టలను పరిశీలన కోసం ఇచ్చారు. వీటిని పరిశీలించిన టీటీడీ ఈవో .. ఈ బుట్టలను త్వరలోనే లడ్డూ కౌంటర్లలో వాడకంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వీటి వాడకం ద్వారా కలిగే ప్రయోజనాలు, భక్తుల సౌకర్యం, వినియోగ సాధ్యాలను పరిశీలిస్తామని... భక్తులకు ఎంత మేర ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అధ్యయనం చేసి... పూర్తిగా స్థాయిలో వినియోగంలోకి తెస్తామని చెప్పారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో తాటాకు బుట్టలను వినియోగించడం ద్వారా... వాటిని తయారు చేసే వారికి ఉపాధి కల్పించి చేయూత అందించినట్లు అవుతుందని.. అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుందని టీటీడీ భావిస్తోంది.

కాగా... తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్‌ వినియోగంపై టీటీడీ సంపూర్ణ నిషేధం విధించింది. లడ్డూ కౌంటర్లలో బయో'డీ'గ్రేడెబుల్ కవర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులకి వాటిలోనే లడ్డూ ప్రసాదాన్ని అందిస్తోంది. అలాగే.. తిరుమలలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్‌ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించడం లేదు. టీటీడీకి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలను ఇప్పటికే నిషేధించారు. కొండపై ఏ దుకాణంలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను విక్రయించరు. వాటికి బదులు గాజు సీసాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.