PM vizag tour: ప్రధాని విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా?
PM vizag tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 11, 12 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
PM vizag tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో తమిళనాడులోని మధురై నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రి పూట ఈస్ట్ నావల్ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు.
12వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీ చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే వివిధ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 12 గంటలకు విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ పయనమవుతారు.
కాగా ప్రధాన మంత్రి పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు పోటీపడుతున్నాయి.
ప్రధాని పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమమని వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతుండగా, ప్రభుత్వ కార్యక్రమమైతే అధికార పార్టీకి చెందిన ఎంపీ ఎందుకు ప్రకటిస్తున్నారని బీజేపీ మండిపడింది. ‘ప్రధాని బహిరంగ సభకు లక్షలాది మంది వస్తారని ప్రకటించాల్సిన అవసరం ఎక్కడిది.. డ్రామాలు ఆపాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ప్రధాని రెండు రోజుల పర్యటన అధికారిక కార్యక్రమం అని, మరో ఏడు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా నవంబర్ 12న జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖపట్నం సందర్శించవలసిందిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగస్ట్‌లో ప్రధాన మంత్రిని అభ్యర్థించారు. హెచ్‌పీసీఎల్ పెట్రోలియం రిఫైనరీ విస్తరణ, ఆధునీకరణ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ క్యాంపస్ మొదటి దశ, విశాఖపట్నం ఓడరేవులో క్రూయిజ్ టెర్మినల్ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి, 400 పడకల స్పెషాలిటీ ఇఎస్‌ఐ ఆస్పత్రి (రూ. 385 కోట్లు), ఆధునిక మెగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేసిన వాగ్దానాలలో ఒకటైన కొత్త సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌పై ఇంకా స్పష్టత లేదు. నవంబర్ 12న ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సభకు జనసమీకరణ కోసం బీజేపీ తనవంతుగా ఏర్పాట్లు చేసుకుంటుండగా, ‘రెండు లక్షల మందికి తక్కువ కాకుండా’ వచ్చి ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగం వింటారని వైఎస్సార్‌సీపీ తెలిపింది. విశాఖపట్నం, పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి ప్రజలను తీసుకురావాలని స్థానిక నాయకులను వైఎస్సార్‌సీపీ ఆదేశించింది.
కాగా ప్రధాన మంత్రి పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారా? అన్న ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బదులిస్తూ అందరినీ ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత టీడీపీ అధ్యక్షుడిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్‌గా మారింది.