Social Welfare Students In JEE : సోషల్ వెల్ఫేర్ విద్యార్ధుల విజయకేతనం….-social welfare students of andhra pradesh got ranks in jee general category ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Social Welfare Students In Jee : సోషల్ వెల్ఫేర్ విద్యార్ధుల విజయకేతనం….

Social Welfare Students In JEE : సోషల్ వెల్ఫేర్ విద్యార్ధుల విజయకేతనం….

HT Telugu Desk HT Telugu
Feb 09, 2023 01:55 PM IST

Social Welfare Students In JEE జేఈఈ తొలి విడత ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గురుకుల కాలేజీల విద్యార్థులు ప్రతిభ చూపించారు. 189 మంది విద్యార్ధుల్లో 151 మంది జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక అయ్యారు. ప్రస్తుత ఫలితాలతో 93 మందికి నేరుగా ఎన్ఐటీల్లో సీట్లు లభించే అవకాశం ఉందని మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.

గురుకుల విద్యార్ధుల్ని అభినందిస్తున్న మంత్రి నాగార్జున
గురుకుల విద్యార్ధుల్ని అభినందిస్తున్న మంత్రి నాగార్జున

Social Welfare Students In JEE జేఈఈ తొలివిడత పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అద్భుతమైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. పరీక్షలు రాసిన 189 మంది విద్యార్థుల్లో 151 మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడంతో పాటుగా 93 మంది విద్యార్థులు ప్రస్తుతం సాధించిన ఫలితాలతోనే ఎన్ఐటీలలో సీట్లు పొందే అవకాశాన్ని దక్కించుకున్నారని వివరించారు.

ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు, కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులలో జేఈఈ, నీట్ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల నుంచి ఈ ఏడాది మొత్తం 189 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలు రాాశారని నాగార్జున చెప్పారు.

సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులలో 151 మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హతను సాధించారని వివరించారు. జేఈఈ తొలి విడత పరీక్షల్లో పలువురు ఎస్సీ విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 99.05 పర్సంటైల్ వరకూ మార్కులను సాధించారని చెప్పారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఓవరాల్ గా చిన్నటేకూరు శిక్షణా కేంద్రానికి చెందిన వరదా పవన్ కుమార్ 96.61, మల్లెపోగు అవన్ కుమార్ 95.49, రవణ కిరణ్ కుమార్ 95.39 పర్సంటైల్ ను సాధించగా, ఈడ్పుగల్లుకు చెందిన జి.మనోజ్ఞ 95.60, అడవి తక్కెళ్లపాడుకు చెందిన అజయ్ భార్గవ్ 93.63 పర్సంటైల్స్ సాధించి ఎస్సీ గురుకులాల్లో టాపర్స్ గా నిలిచారని వివరించారు.

ఎన్ఐటీ లలో సీట్లు సాధించడానికి అంచనా వేస్తున్న కటాఫ్ మార్కుల ప్రకారంగా తమ గురుకులాల నుంచి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 151 మంది విద్యార్థులలో 93 మంది ప్రస్తుతం సాధించిన మార్కులతోనే సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లోనే అత్యధిక మార్కులు సాధించగలిగారని, మరి కొన్ని సబ్జెక్టుల్లో వివిధ కారణాలతో మార్కులు తగ్గాయని కూడా తాము గుర్తించినట్లు నాగార్జున వెల్లడించారు.

విద్యార్థులు అందరూ జేఈఈ మలి విడత పరీక్షల్లో వారి లోపాలు సరిదిద్దుకొనేలా శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు ఎస్సీ రిజర్వేషన్ విభాగం నుంచి కాకుండా తమ ప్రతిభతో జనరల్ కేటగిరీలోనే సీట్లు పొందే అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. గతంలో తమ విద్యార్థులు జేఈఈ సరీక్షల్లో సాధించిన ఫలితాల కంటే ఈసారి ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చాయని అభిప్రాయపడ్డారు.

Whats_app_banner