Mangampet Murder: కుమార్తెపై లైంగిక వేధింపులు, ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు, కువైట్‌ నుంచి వచ్చి మరీ చంపేశాడు…-sexual harassment to daughter police ignored the complaint father killed the accused ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mangampet Murder: కుమార్తెపై లైంగిక వేధింపులు, ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు, కువైట్‌ నుంచి వచ్చి మరీ చంపేశాడు…

Mangampet Murder: కుమార్తెపై లైంగిక వేధింపులు, ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు, కువైట్‌ నుంచి వచ్చి మరీ చంపేశాడు…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 12, 2024 12:46 PM IST

Mangampet Murder: తన కుమార్తెను తాత వరుసయ్యే వ్యక్తి లైంగికంగా వేధించాడని తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. నిందితుడిపై చర్యలు తీసుకోని పోలీసులు మందలించి పంపేశారు. పోలీసుల తీరుపై రగిలిపోయిన తండ్రి కువైట్‌ నుంచి వచ్చి నిందితుడ్ని హత్య చేసి తిరిగి వెళ్లిపోయాడు.తానే హత్య చేసినట్టు వీడియో విడుదల చేశాడు.

కుమార్తెను వేధించిన బంధువును చంపేసిన ఆంజనేయ ప్రసాద్
కుమార్తెను వేధించిన బంధువును చంపేసిన ఆంజనేయ ప్రసాద్

Mangampet Murder: తమ కుమార్తెపై తాత వరుసయ్యే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటంపై బాధితురాలి తల్లి కువైట్ నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రగిలిపోయిన బాలిక తండ్రి కువైట్‌ నుంచి వచ్చి హత్య చేసి తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. హంతకుడు హత్య తానే చేసినట్టు చెప్పే వరకు ఈ విషయం బయటకు తెలియలేదు.

yearly horoscope entry point

పోలీసుల నిర్లక్ష్యంతో అన్నమయ్య జిల్లాలో ఓ హత్య జరిగింది. కుమార్తెకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై బాధితురాలి తల్లి పోలీసుల్ని ఆశ్రయించినా న్యాయం జరగక పోవడంతో బాధితురాలి తండ్రి పగతో రగిలిపోయాడు. తన కుమార్తె వేధించిన వాళ్లను పోలీసులు కూడా వదిలేయడంతో కక్ష కట్టి వచ్చి హత్య చేశాడు.

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించకపోవడంతో, కేసు నమోదు చేయకపోవడంతో ఒకరు ఏకంగా కువైట్ నుంచి వచ్చి హత్య చేసి, తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. కువైట్ నుంచి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడంతో మర్డర్ మిస్టరీ వీడింది.

అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలం కొత్తమంగంపేటలో శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. హత్యకుసంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈక్రమంలో ఆంజనేయులు తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తాను కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసినట్టు నిందితుడు వీడియోలు విడుదల చేశాడు. ఈ వీడియో వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారడంతో పోలీసుల నిర్వాకం బయటపడింది.

కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్‌లో పనిచేస్తున్నారు. వారి కుమార్తెను ఊళ్లో ఉంటున్న చంద్రకళ చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల సంరక్షణలో ఉంచారు. ఆంజనేయ ప్రసాద్‌కు బాబాయ్‌ వరుసయ్యే, వెంకటరమణ తండ్రి ఆంజ నేయులు మనవరాలి వరసయ్యే మైనర్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తాత వేధింపులను వివరించింది. ఈ వ్యవహారంపై చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడిగినా ఆమె సరిగా స్పందించలేదు.

బాలిక చెప్పిన వివరాలతో ఆందోళన గురైన చంద్రకళ కొద్ది రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓబులవారి పల్లె పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి, హెచ్చరించి వదిలేశారు. ఈ విషయాన్ని చంద్రకళ తన భర్త ఆంజనేయ ప్రసాద్‌కు తెలిపింది. పోలీసుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆంజనేయ ప్రసాద్ ఆడపిల్లతో అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు విడిచిపెట్టడంపై కలత చెందాడు.

కువైట్ నుంచి కొత్తమంగంపేట వచ్చాడు. అతను వచ్చినట్టు స్థానికులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. శనివారం తెల్లవారుజామున గ్రామానికి చేరుకున్న ఆంజనేయ ప్రసాద్ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని వివరిస్తూ బుధవారం సోసల్ మీడియాలో వీడియో పోస్టు చేయడంతో హత్య గుట్టు వీడింది. ఆడపిల్ల తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. హత్య చేసిన నేరానికి త్వరలో పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం న్యాయం దొరక్క పోవడంతో హత్య చేశానని వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఏమి జరిగిందంటే…

బాలికతో ఆంజనేయులు అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత ఆంజనేయ ప్రసాద్ భార్య చంద్రకళ ఓబులవారి పల్లె  పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును మందలించి విడిచిపెట్టేశారు.  కూతురు పరువు పోకూడదని  తల్లితో పాటు కువైట్‌ తీసుకెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆంజనేయ ప్రసాద్ మరదలు లక్ష్మీ, ఆమె భర్త వెంకటరమణలు  బంధువులందరికి ఘటన గురించి ప్రచారం చేశారని ఆరోపించారు. 

తమ మామపై పెట్టిన కేసును డబ్బులు కట్టినట్టు బయటపడ్డామని గొప్పగా చెప్పుకోవడంతో మనస్థాపం చెందినట్టు వీడియోలో ఆంజనేయ ప్రసాద్ వివరించాడు. ఆ తర్వాత తన భార్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరదలు లక్ష్మీ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తన భార్యను అరెస్ట్ చేస్తామని బెదిరించారని వాపోయాడు.

తన కుమార్తెపై లైంగికంగా వేధించి  తమనే తిరిగి  వేధిస్తుండటంతో హత్యకు పథక రచన చేసినట్టు నిందితుడు వీడియోలో వివరించాడు. ఎవరికి తెలియకుండా అనారోగ్య కారణాలు చెప్పి రెండు రోజులు సెలవు తీసుకుని వచ్చి ఆంజనేయులును హత్య చేసినట్టు పేర్కొన్నాడు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే  ఉద్దేశంతోనే, పోలీసుల తీరుతో న్యాయం జరగదని భావించి, ఆడపిల్లల అన్యాయం జరిగితే సరైన విధంగా స్పందించాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్టు  వివరించాడు. పోలీసులకు సరెండర్‌ అయిపోతానని, చట్టం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం తనకు లేదన్నాడు. 

Whats_app_banner