AP Welfare Pensions: అనర్హులకు పెన్షన్లు తొలగించాల్సిందే.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం,
AP Welfare Pensions: ఏపీలో అనర్హులైన వారికి పెన్షన్లను తొలగించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మూడు నెలల్లో అనర్హులను గుర్తించి తొలగించే పని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాథమికంగా కనీసం 6లక్షల మంది అనర్హులకు పెన్షన్లు వెళుతుండొచ్చని మంత్రి నాదెండ్ల వివరించారు.
AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు పెన్షన్ల చెల్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లను గుర్తించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పైలట్ సర్వేలో నకిలీ పెన్షన్లను గుర్తించారని, రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తుండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రికి వివరించారు. పెన్షన్ల జారీ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా అనర్హులను చేర్చేశారని వివరించారు.
దీంతో ముఖ్యమంత్రి మూడునెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పెన్షన్ల తనికీ పూర్తైన తర్వాత తాను మరోసారి కనీసం 5శాతం పెన్షన్లను ర్యాండమ్ తనిఖీ చేయిస్తానని హెచ్చరించారు. అందులో కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేవించారు.
ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 64లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు చెల్లిస్తోంది. సామాజిక పెన్షన్లలో వృద్ధులకు రూ.4వేలు చెల్లిస్తుండగా ఇతర క్యాటగిరీల్లో వివిధ మొత్తాలను చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ పెన్షన్లపై ఫిర్యాదులు రావడంతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్లస్టర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 500మంది అనర్హులుగా కమిటీలు గుర్తించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు సెర్చ్ అధికారులు భావిస్తున్నారు. వితంతువుల విభాగంలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది క్షేత్ర స్థాయి తనికీల్లో గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ప్రతి జిల్లాలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఏ విభాగంలో ఎక్కు వగా అనర్హులు ఉన్నారో గుర్తించేందుకు సెర్చ్ అధికా రులు శాంపిల్ పద్ధతిలో ఈ తనిఖీ నిర్వహించారు. కొన్ని చోట్ల పింఛన్ల తనిఖీలకు లబ్దిదారులు అందుబాటులో లేరు. ముందస్తు సమాచారంతో పత్తా లేకుండా పోయారనే అనుమానాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోని ప్రతి పెన్షనర్‌ను భౌతికంగా అంచనా వేసి అర్హతలు నిర్ధారించాలని తనిఖీ బృందాలకు సెర్ప్ అధికారులు మార్గదర్శకాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది పెన్షనర్లను తనిఖీ చేస్తే అందులో 500మంది వరకు అనర్హులుగా గుర్తించారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు గుర్తించారు. బధిరులు సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారు. లబ్దిదారుల కుటుంబంలో ఎవరికైనా కారు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే పొలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడునెలల్లో అనర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దివ్యాంగులు చాలా మంది రూ. 15 వేలు అడుగుతున్నారని కలెక్టర్లు చెప్పడంతో సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని, ఇందుకోసం కమిటీల పర్యవేక్షణలో సర్టిఫికెట్లను జారీ చేసేలా చూడాలన్నారు.
పంచాయితీలుగా విజయపురి, సున్నిపెంట
ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సున్నిపెంట, విజయపురిలను గ్రామ పంచాయితీలుగా నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయపురిలో అభివృద్ధికి నిధులు కొరతను జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. ఇరిగేషన్ పరిధి నుంచి గ్రామ పంచాయితీలోకి మార్చాలని నిధుల కొరత లేకుండా చూడాలని వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సున్నిపెంటలో అదే తరహా సమస్య ఉండటంతో శ్రీశైలం దేవస్థానం నిధులతో అభివృద్ధి చేపట్టాలని, అటవీ శాఖ భూమి బదలాయింపు వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించి వేగంగా పరిష్కరించుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనంకు సూచించారు. సున్నిపెంట భూమి బదలాయింపు జరిగితే దేవాదాయ శాఖ అభివృద్ధి చేస్తుందని మంత్రి వివరించారు.