Ind vs Aus 3rd Test: గబ్బా కోటను టీమిండియా మళ్లీ జయిస్తుందా? మూడేళ్ల కిందట పంత్ చేసిన మాయ గుర్తుందా?
Ind vs Aus 3rd Test: టీమిండియా మరోసారి గబ్బా కోటను జయిస్తుందా? ఆస్ట్రేలియా గడ్డపై మూడేళ్ల కిందట రిషబ్ పంత్ చేసిన మాయను ఇప్పుడతడు మరోసారి రిపీట్ చేయగలడా? అడిలైడ్ టెస్టులో ఓటమి తర్వాత.. ఇప్పుడు ప్రతి టీమిండియా అభిమాని కోరుకుంటున్నది ఇదే.
Ind vs Aus 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం టీమిండియా బ్రిస్బేన్ చేరుకుంది. ఇక్కడి గబ్బా స్టేడియంలో మూడేళ్ల కిందట పంత్, శుభ్‌మన్ గిల్ చేసిన మాయతో చారిత్రక విజయం సాధించిన మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పైచేయి కోసం ఉవ్విళ్లూరుతోంది. 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు పెట్టని కోటగా ఉన్న గబ్బా స్టేడియంలో 2020-21 పర్యటనలో టీమిండియా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మూడేళ్ల కిందట ఏం జరిగిందంటే?
నిజానికి మూడేళ్ల కిందట కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే అప్పుడు బ్రిస్బేన్ లోని గబ్బాలో నాలుగో టెస్టు జరగగా.. ఇప్పుడు మూడో టెస్టు జరుగుతోంది. 2020-21లో జరిగిన టెస్ట్ సిరీస్ లో నాలుగో టెస్ట్ సమయానికి రెండు టీమ్స్ 1-1తో సమంగా ఉన్నాయి. చివరి టెస్ట్ 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు ఓటమంటే తెలియని బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఉండటంతో ఇండియా గెలవడం అసాధ్యమనుకున్నారు. కానీ ఆ మ్యాచ్ లో 329 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
శుభ్‌మన్ గిల్ 91 రన్స్ చేయగా.. చివరి వరకూ క్రీజులో నిలిచి 89 పరుగులతో టీమ్ కు విజయాన్ని ఖాయం చేశాడు రిషబ్ పంత్. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లు తీసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఇండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది.
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వరుసగా రెండోసారి సిరీస్ గెలిచింది. మరే ఇతర జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది. ఈ సిరీస్ విజయం తర్వాత పంత్, గిల్, విహారి, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ లాంటి యువ ఆటగాళ్ల పేర్లు మార్మోగిపోయాయి. కోహ్లి లేకపోవడంతో రహానే సారథ్యంలో ఆ సిరీస్ లో చివరి మూడు టెస్టులు ఆడింది టీమిండియా.
గబ్బాను మళ్లీ జయిస్తారా?
ఇప్పుడు కూడా ఐదు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టుల తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు కోసం గురువారం (డిసెంబర్ 12) బ్రిస్బేన్ లో అడుగుపెట్టింది టీమిండియా. అడిలైడ్ డేనైట్ టెస్టులో దారుణంగా 10 వికెట్లతో ఓడిపోయిన ఒత్తిడి ఉండటంతో గబ్బాలో టీమ్ కు అసలు సిసలు సవాలు ఎదురు కానుంది.
మూడేళ్ల కిందట ఆ చారిత్రక విజయం సాధించిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, సిరాజ్ లాంటి వాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కోహ్లితోపాటు బుమ్రా, అశ్విన్, జడేజా ఆ మ్యాచ్ ఆడలేదు. మరి అప్పుడు సాధించిన ఆ విజయం స్ఫూర్తితో ఇప్పుడూ చెలరేగుతారా? ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన మూడు టెస్టులూ గెలవాల్సిన ఒత్తిడిలో ఉన్న రోహిత్ సేనకు అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు.
గబ్బాలోనూ పేస్ పిచ్ స్వాగతం పలకనుంది. అలాంటి పిచ్ పై ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా పేసర్లను ఎదుర్కోవడం సవాలే. మరి ఈ సవాలుకు టీమిండియా ఎంత వరకూ సిద్ధమైందో శనివారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుతో తేలనుంది.